అటా, ఇటా?: మోహన్ బాబు పొలిటికల్ డైలమా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చిరకాల స్నేహం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో బంధుత్వం ఆయన ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడేశాయని అంటున్నారు. మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ కొద్ది కాలం క్రితం ప్రచారం హోరెత్తింది. ఆయన ఒకటి, రెండు సార్లు చంచల్‌గుడా జైలులో జగన్‌ను కలుసుకోవడంతో ఆ ప్రచారం ముమ్మరంగా సాగింది.
వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించి, పోటీ చేయాలనేది మోహన్ బాబు లక్ష్యంగా కనిపిస్తోంది. తాను రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కూడా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంపై అటు చంద్రబాబు గానీ ఇటు వైయస్ జగన్ గానీ హామీలు ఇవ్వడం లేదని అంటున్నారు. జగన్ కుటుంబానికి చెందిన విరోనిక మోహన్ బాబు కోడలు. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి విడదీయరాని బంధం ఏర్పడింది.
ఇకపోతే, మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి కూడా రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని అంటున్నారు. ఆమె రాయలసీమలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు. అయితే, ఆమె పార్టీ కూడా ఇప్పటి వరకు తేలలేదు. ఏమవుతుందో, ఎన్నికలు సమీపిస్తే గానీ తేలదు.












Click it and Unblock the Notifications