లగడపాటికి పురంధేశ్వరితో చెక్: రాజధాని దౌత్యం?
కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇలాకా విజయవాడలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావులు కీలక మంతనాలు జరిపారు. విభజన అనివార్యమని తేలిన నేపథ్యంలో రాజధాని, తన పోటీ విషయం తదితరాలపై చర్చించేందుకు బెజవాడలోని ఓ హోటల్లో పలువురితో దగ్గుబాటి దంపతులు భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దగ్గుబాటి దంపతులు చేపట్టిన రహస్య దౌత్యం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, వెంకటేశ్వర రావు బుధవారం విజయవాడ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రముఖ హోటల్‌లో వారు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న పలు ఐకాసల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ప్రధానంగా విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏమేం కోరాలన్న అంశం పైనా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు అవసరమైన సూచనల పైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సమావేశానికి హాజరైన ప్రతినిధులలో కొందరు విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును గట్టిగా వ్యతిరేకించారు.
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగా ఉంచాల్సిందేనని, సీమాంధ్రలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, విభజిస్తే కష్టాలు తప్పవని తేల్చి చెప్పారు. విడిపోతే ఒనగూరే ప్రయోజనాల గురించి ఒక్క మాటైనా చెప్పలేదని, అసలు రోడ్ మ్యాప్ అంటూ లేకుండా, ప్రజలతో చర్చించకుండా విభజనను చేపట్టారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని, నీరు, ఉద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం చూపాకే విభజన జరగాలని కొందరు ప్రశ్నించారు. అయితే అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, మంత్రులంతా వారి వారి పరిధిలో పని చేస్తున్నారని, అందరం మూకుమ్మడిగా ఓ నిర్ణయాన్ని తీసుకుని, జివోఎం దృష్టికి తీసుకు వెళతామని ఈ సందర్భంగా పురందేశ్వరి వివరణ ఇచ్చారట. తమకు తెలియకుండా కేబినెట్ నోట్‌ని తీసుకువచ్చారని ఆమె తెలిపారు.
దీనిపై స్పందించే తాము రాజీనామాలు చేశామని, అయితే పదవిలో ఉంటేనే అన్ని సమస్యలపైనా కేంద్రంతో మాట్లాడటానికి వీలుంటుందని చెప్పారు. సమైక్యంగా ఉండే వీలులేకపోతే, విడిపోతే తీసుకోవాల్సిన చర్యలు, సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో తాము గట్టిగా నిలబడతామని పేర్కొన్నారు. కాగా, విభజన జరిగితే విజయవాడను రాజధానిగా చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.
దగ్గుబాటి దంపతులు కూడా విజయవాడ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోతే విజయవాడను రాజధాని చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు పురంధేశ్వరిని విజయవాడను రాజధాని చేయడం కోసం ప్రయత్నించాలని కోరినట్లుగా తెలుస్తోంది. కాగా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిలను కలిపి రాజధానిగా చేస్తే బావుంటుందని కొందరు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
లగడపాటికి పురంధేశ్వరి చెక్
మరోవైపు 2014 ఎన్నికలలో తాను విశాఖ నుండి పోటీ చేస్తానని టి సుబ్బిరామి రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి దృష్టి విజయవాడ పైన పడి ఉంటుందంటున్నారు. తమకు సవాల్‌గా మారిన లగడపాటిని తప్పించి పురంధేశ్వరిని విజయవాడ బరి నుండి దింపే ఆలోచన అధిష్టానం చేస్తుందా అనే చర్చ సాగుతోంది. పురంధేశ్వరి వచ్చే ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండవచ్చునని అంటున్నారు. తద్వారా లగడపాటి సమైక్యవాదానికి ధీటుగా సీమాంధ్రకు న్యాయాన్ని పురంధేశ్వరి ద్వారా విజయవాడలో వినిపించాలని అధిష్టానం భావిస్తుండవచ్చునని అంటున్ారు.












Click it and Unblock the Notifications