నెట్ వారికి ఆయుధం: లోకేష్ వర్సెస్ భారతి

నారా లోకేష్ ఇటీవల ట్విట్టర్‌లో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన జగన్, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీల పైనా ట్వీట్స్ చేశారు. జగన్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఆకర్షించడాన్ని లోకేష్ ప్రశ్నించారు. అలాగే కాంగ్రెసు పాలన అసమర్థంగా ఉందని చెప్పారు. ఇటీవల అఖిల పక్ష సమావేశం తర్వాత హరీష్ రావు, కెటిఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు తిరిగి ట్విట్టర్ ద్వారానే లోకేష్‌కు సమాధానమిచ్చారు.
అలాగే చంద్రబాబు పాదయాత్ర పైనా అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తున్నాడు. నారా లోకేష్ ట్వీట్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. నేతలు బయట ఉండి ప్రజల్లోకి వెళితే లోకేష్ ఇంటర్నెట్ ఉపయోగించుకొని యువతలోకి టిడిపిని, చంద్రబాబు ప్రయత్నాన్ని తీసుకు వెళ్తున్నారు. అదే సమయంలో యువతలో తన ఇమేజ్ పెంపొందించుకుంటున్నారు. టిడిపి గురించి ప్రచారం చేసేందుకు తనకు జగన్‌లా పత్రిక, పేపర్ లేవని అందకే తాను ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్నానని లోకేష్ చెబుతున్నారు.
భారతి కూడా...
వైయస్ జగన్ సతీమణి భారతి కూడా ఇంటర్నెట్‌లో తన భర్త కోసం పరితపిస్తోంది. లోకేష్ ట్విట్టర్‌ను ఉపయోగించుకుంటే భారతి రెడ్డి వెబ్ సైట్స్ ద్వారా తన భర్త విడుదల కోసం నెట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వెబ్ సైట్లో భారతి రెడ్డి తన భర్త ఎలా కుట్రల కారణంగా జైలుకు వెళ్లారో తెలుపుతూ.. సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సంతకాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లాలనేది భారతి ఉద్దేశ్యం. ఇప్పటి వరకు భారతి రెడ్డి రాజకీయాల పరంగా బయటకు రాలేదు. అయితే ఆమె వెబ్ సైట్లో తన భర్త విడుదల కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications