మధు యాష్కీ ఎందుకు ప్లేటు మార్చారు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గడువు పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని అధిష్టానం చెప్తే సరిపోదని మిగతా పార్లమెంటు సభ్యులు అంటున్నారు. మధు యాష్కీ ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. తాను తెలంగాణ వైపు ఉంటూనే రాహుల్ గాంధీకి ఆగ్రహం తెప్పించకూడదనే ఉద్దేశంతోనే మధు యాష్కీ ఆ విధంగా వ్యవహరించి ఉంటారనే ప్రచారం సాగుతోంది.
పైగా, రాజీనామాలు చేస్తామని తెలంగాణ ఎంపీలు ప్రకటించిన వెంటనే కేంద్ర మంత్రి వాయలార్ రవి నుంచి మధు యాష్కీకే ఫోన్ వచ్చింది. మిగతా ఎంపిలను పట్టించుకోలేదు. దీన్నిబట్టి అధిష్టానం డ్రామాలో యాష్కీ ఓ పాత్ర ధరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడడంలో యాష్కీ ముందు ఉంటున్నారు.
ఇదిలావుంటే, మరో ప్రచారం కూడా సాగుతోంది. నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తన సీటుకు ఎసరు వస్తుందనే ఉద్దేశంతో మధు యాష్కీ కెసిఆర్‌పై దాడికి దిగుతూ, అధిష్టానం కనుసన్నల్లో మెలగాలని అనుకుంటున్నారా అనేది కూడా ఓ ప్రశ్నగానే ఉంది.
రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడం వల్ల టికెట్ సాధించుకోవడం పెద్ద కష్టం కాదని కూడా యాష్కీ భావిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, తెలంగాణపై ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన యాష్కీపై తెలంగాణ నేతల్లో అనుమానాలు పొడసూపుతున్నాయి.












Click it and Unblock the Notifications