విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిపై బాబుకు బీజేపీ నేత షాక్? ఆందోళన.

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/గుంటూరు: రాజధాని విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోందా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పైన ఆంధ్రప్రదేశ్ సర్కారు వద్ద స్పష్టత లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంకిషోర్ బాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

పచ్చని భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో ఉండాలనుకోవడం సరికాదని ఆయన సోమవారం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు మొండి వైఖరిని అవలంబిస్తే బాధితుల తరఫున తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని ఏర్పాటు, భూముల సేకరణ విషయమై జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం కోసం తొలిదశగా గుంటూరు జిల్లాలో 19 మండలాల్లో 30వేల ఎకరాల భూమి సమీకరణ, నాలుగు, ఆరు లేన్ల రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలోనూ రైతులు, సామాన్యులు, చిరు వ్యాపారుల్లో ఆందోళన కనిపిస్తోందంటున్నారు.

తొలుత విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మించనున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే అన్నివర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే తర్వాత్తర్వాత తమ భవిష్యత్ ఏమిటనేది సామాన్యుల్లో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రాజధాని నిర్మాణం తరువాత పెరిగే భూముల ధరలు మాటెలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి తమ ఇళ్లు, దుకాణాలు, స్థలాలు, భూములు ఎక్కడ కోల్పోతామోననే ఆందోళన వారిలో ప్రారంభమైందంటున్నారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరం నుంచి 15కి.మీ.ల దూరంలో దాదాపు 30వేల ఎకరాలను సేకరిస్తామంటూ ఆ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ భూములన్నీ వాణిజ్య పంటలు, అదీ ఏడాది పొడవునా నాలుగు రకాల పంటలనిచ్చే సారవంతమైన పొలాలు. అక్కడ 10 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి భూములను అప్పగించేందుకు పలువురు రైతులు సిద్ధంగా లేరంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఎకరానికి 970 గజాలకు మించి తిరిగి రైతుకు లభించే అవకాశం లేదు. అభివృద్ధి జరిగి ఆ కొద్దిపాటి భూమి సంబంధిత భూయజమాని చేతికి దక్కేవరకు ఏటా 20వేలు పరిహారంగా చెల్లిస్తానంటూ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి నదీతీరం నుంచి ఇసుకను తరలించే ట్రాక్టర్లకు కొద్దిపాటి దారి ఇస్తేనే నెలకు 20వేలకు పైగా రైతుకు అందుతోంది.

 BJP leader faults AP land acquisition

మరోవైపు రుణమాఫీ పూర్తిగా అమల్లోకి రాకపోవటం వంటి ఇతరత్రా కారణాల వల్ల ఆప్రాంత రైతులు తమ భూములు అప్పగించేందుకు సుముఖంగా లేరు. తాము భూములు ఇవ్వబోమని పలు గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయిస్తున్నారు. ఇదిలావుంటే, కృష్ణానదిపై కొత్తగా మూడు ప్రదేశాల్లో భారీ వంతెనలు, వాటికి అటూ ఇటూ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం జరగనున్నదంటూ మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు.

దీనికి తోడు ప్రభుత్వం రాజధాని నిర్మాణ ప్రాంత పరిసరాల్లో అన్నిరకాల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ రహదారులు ఎటు నుంచి ఎటు వెళతాయనే దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇక ఇప్పటివరకు ఆక్రమిత ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటూ లేదా పలు రకాల వ్యాపారాలు సాగిస్తూ వస్తున్న వారు ఉపాధి కోల్పోతామని భయపడుతున్నారు.

గుంటూరు జిల్లాలో రాజధానికి ఎంపిక చేసే గ్రామాల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేసే ఆరు మార్గాలను అధికారులు గుర్తించారు. సత్తెనపల్లి నుంచి అమరావతి ద్వారా తుళ్ళూరు, మంగళగిరి నుంచి పెదపరిమి ద్వారా అమరావతి, ఎర్రబాలెం ద్వారా తుళ్ళూరు, గుంటూరు - అమరావతి, తుళ్ళూరు- తాడికొండ అడ్డరోడ్డు, తాడికొండ - కంతేరు మార్గాల్లో రహదారులను విస్తరించాలని ఆలోచిస్తున్నారు.

ఈ ఆరు మార్గాల్లో దాదాపు 40 గ్రామాల ప్రజలు నివశిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో 12 నుంచి 20 అడుగులకు మించి ఏ రోడ్డు కూడా వెడల్పు లేదు. అయితే 80 నుంచి 120 అడుగుల మేర ఈ రోడ్లను విస్తరిస్తారనే ప్రచారంతో పరిసరాల్లో ఇళ్లస్థలాలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పొలాలు కలిగినవారు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో స్థానికులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి తమ వ్యతిరేకత ఎలా తెలియజేయాలనే దానిపై చర్చించుకుంటున్నారు.

English summary
One of the BJP leader faults AP land acquisition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X