బిజెపికి కొత్త దోస్త్: మల్కాజిగిరిపై జెపి కన్ను?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి కొత్త మిత్రుడు దొరికారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పొత్తు కుదుర్చుకోవాలని ఇప్పటికే ప్రాథమిక అవగాహనకు వచ్చిన బిజెపికి తాజాగా లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ దొరికారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ప్రయత్నించి విఫలమైన జయప్రకాష్ నారాయణ బిజెపితో స్నేహానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేస్తున్న నేపథ్యంలో బిజెపితో పొత్తుకు జయప్రకాష్ నారాయణ ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వారసత్వ రాజకీయాలకు గండి కొట్టే ప్రయత్నంలో భాగంగా బిజెపికి సహకరించాలని జయప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆయన మల్కాజిగిరి పార్లమెంటు సీటుపై కన్నేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా జయప్రకాష్ నారాయణ పేరును లోకసత్తా ఇప్పటికే ప్రకటించింది. అయితే, తాజాగా తన వైఖరిని మార్చుకుని మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని అడుగుతున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో జెపిని గెలిపించిన కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దానికితోడు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 70 శాతం మందిదాకా సీమాంధ్ర ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి బిజెపి సహకారంతో జెపి లోకసభకు గెలవడం సులభమవుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications