ఉద్వేగం: రెండ్రోజుల్లో జగన్ గురించి కెవిపి ఏంచెప్తారు?

KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు ఏం చెబుతారు? ఈ విషయమై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. శనివారం గాంధీ భవన్లో ఉద్వేగభరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.

ఆయన ప్రసంగం అనంతరం.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి రాజీవ్ గాంధీ ఇచ్చిన గౌరవాన్ని ఆయన తనయుడు వైయస్ జగన్ మరిచిపోయారా? అని విలేకరులు ప్రశ్నించారు. దానికి కెవిపి ఉద్వేగంగా స్పందించారు. తాను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడనని, రెండు రోజుల్లో మీడియా సమావేశం పెడతానని తెలిపారు. దీంతో ఆయన ఏం చెబుతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ, రఘురామ కృష్ణం రాజు, సబ్బం హరి, మారెప్పలు జగన్ పైన నిప్పులు చెరుగుతున్నారు.

కాగా, తాను వైయస్ చివరి కోరికను నెరవేరుస్తానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని కెవిపి అంతకుముందు ప్రసంగంలో అన్నారు. తాను పరిపూర్ణ పురుషుడిననో లోపాలు లేని వ్యక్తిననో చెప్పడం లేదని, తమ ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరుతున్నానని కెవిపి అన్నారు. రాష్ట్రం నుంచి 41 మంది ఎంపీలను గెలిపించి, రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న వైయస్ అంతిక కోరికను నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.

చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీ మనిషిగానే చనిపోతానని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యునిగా తాను రెండోసారి ఎన్నికయ్యేందుకు కారణమైన అధిష్ఠానానికి, ఓటు వేసిన ఎమ్మెల్యేలకు, సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 1983లో రాజీవ్ తీసుకున్న నిర్ణయం వల్లే వైయస్సార్‌ను పిసిసి అధ్యక్ష పదవి వరించిందని, దానిని వైయస్ మిత్రునిగా తానెప్పటికీ మరిచిపోలేనన్నారు.

33 ఏళ్ల వయసులో తాను గాంధీ భవన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ప్రతిష్ఠను అప్రతిష్ఠనూ రెండింటినీ మూట గట్టుకున్నానన్నారు. గాంధీభవన్ ఇన్‌ఛార్జిగా మహామహులైన కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, టి అంజయ్య వంటి వారి ఇళ్లకు వెళ్లి బి-ఫారాలు అందించానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకునేందుకే భయపడుతున్న రోజుల్లో తాను గుంటూరులో ఇందిరాగాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశానన్నారు.

తాను 1989-96 మధ్య కాలంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని అంగీకరించారు. దానికి కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానన్నారు. 1996 తర్వాత తనకు తెలిసి పార్టీకి నష్టం చేయలేదన్నారు. 2003లో వైయస్ పాదయాత్ర చేపట్టకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయితే అప్పటి పిసిసి అధ్యక్షులు ఎమ్మెస్సార్ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో తమకు సాయం చేశారన్నారు.

ఆ పాదయాత్రే రాష్ట్రంలో పార్టీకి కీలక మలుపు అన్నారు. గాంధీభవన్‌లో పడే ప్రతి అడుగు వెనుక తన హస్తముందని, కానీ కొందరు మిత్రులు తనను గాంధీభవన్‌లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారు తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని కూడా ప్రచారం చేశారన్నారు.

కానీ, తాను చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కెవిపి స్పష్టం చేశారు. తానెందరికో రాజకీయ మెలకువలు నేర్పానని, 2014నే కాదు 2019 ఎన్నికల్లోనూ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 2009లో వైయస్ దుర్ఘటన తర్వాత రాష్ట్రానికి చెడ్డరోజులు మొదలయ్యాయని, కాంగ్రెస్ పార్టీలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయన్నారు. కాగా, రెండు నిమిషాలు మాట్లాడుతానని చెప్పిన కెవిపి గంటకు పైగా మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+