నారా లోకేష్: ఈసారి కూడా తెర వెనకేనా?
హైదరాబాద్: తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటి తలిస్తే కాంగ్రెసు అధిష్టానం మరోటి తలించిట్లే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తనయుడు నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో కూడా తెర వెనక నుంచే పనిచేయడానికి పరిమితమైనట్లు చెబుతున్నారు. నారా లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన పోటీకి సంబంధించిన విషయమేదీ ముందుకు రావడం లేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఆయన తెర వెనక నుంచే పార్టీ విజయానికి చేయూత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే తెర వెనక తన తండ్రి చంద్రబాబుకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ప్రసంగంలో ఉద్వేగం, ఆవేశం కలగలిసిన వ్యాఖ్యల వెనక నారా లోకేష్ చేయి ఉందని అంటున్నారు. చంద్రబాబు సాధారణంగా ఏ విధమైన ఎత్తుపల్లాలు లేకుండా, సాధారణమైన రీతిలో ప్రసంగాలు చేస్తారు. కానీ ఈసారి బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాల్లో సృజనాత్మకత, కొత్త పదజాలం కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును వసూల్ రాజా అని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని, ఆయన పార్టీని సైకో పార్టీ అని చంద్రబాబు అంటున్నారు. ఇంకా ఇటువంటి పదాల కూర్పు చంద్రబాబు ప్రసంగాల్లో కనిపిస్తోంది. ఇదంతా నారా లోకేష్ సృజనాత్మకత అని అంటున్నారు. నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. కానీ అదేమీ లేదని ఇప్పుడు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి, మరి.












Click it and Unblock the Notifications