భావోద్వేగాల్లేని జయ, జగన్ సహా అందరు.. కానీ!
బెంగళూరు: తనకు బెయిల్ వచ్చిన విషయం బెయిల్ వచ్చిన విషయం తెలిసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శుక్రవారం నాడు చిరునవ్వులు చిందించడం మినహా, ఆమెలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదట. రెండు రోజుల క్రితం పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలితకు బెయిల్ వచ్చినట్లు సమాచారం అందింది.
ఈ శుభవార్త విన్న తర్వాత ఆమె స్పందన ఏమిటి? ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు కర్ణాటక జైళ్ల డీఐజీ జయసింహ సమాధానమిచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం... బెయిలు వచ్చిన ఆనందంలో జయ ఉబ్బితబ్బిబ్బు కాలేదు. కూల్‌గానే కనిపించారు. చిరునవ్వు చిందించారని, బయట చెప్పుకొంటున్నట్లుగా మిఠాయిలు పంచుకోలేదన్నారు.
జైలు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారన్నారు. జైలు సిబ్బంది తనకు బాగా సహకరించారని, ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని, మీ అందరికీ ధన్యవాదాలు. ఉంటానంటూ జయబయటికి వచ్చారు.

జైలుకు వచ్చినప్పుడు రెండు చిన్న చెవి కమ్మలు డిపాజిట్ చేశారని, వాటిని ఆమె తిరిగి వెళ్తున్నప్పుడు అప్పగించామని జయసింహ తెలిపారు. ఆమె జైలులో ఉన్నప్పుడు తాను మాట్లాడానని... తన గురించి, తన కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారని జయసింహ పేర్కొన్నారు.
ఇది తనను ఎంతగానో కదిలించిందన్నారు. జైలులో ఉన్నన్ని రోజులు జయ చాలా నిరాడంబరంగా, సాధారణ వ్యక్తిలా ఉన్నారన్నారు. నిబంధనలు అనుమతించిన మేరకు తప్ప ఎలాంటి అదనపు సౌకర్యాలు కోరలేదన్నారు. జైలులో ఆమె ఎవ్వరితోనూ రాజకీయపరమైన భేటీలు జరపలేదని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వంతో కూడా ఆమె భేటీ కాలేదన్నారు. మానసికంగా ఆమె చాలా ధైర్యవంతురాలని జయసింహ వ్యాఖ్యానించారు.
కాగా, అక్రమాస్తుల కేసు విచారణలో 18 ఏళ్ల పాటు వాయిదాలు తీసుకోవడం ఒక ఎత్తయితే, శిక్ష పడిన 21 రోజుల్లోనే బెయిల్ పొందడం మరో ఎత్తు! దాణా కుంభకోణంలో జైలుకెళ్లిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఏడాది తర్వాత కానీ బెయిల్ దక్కించుకోలేకపోయారు.
ఇక హర్యానా మాజీ ఓం ప్రకాశ్ చౌతాలా అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొనగా, ఆయన బెయిల్‌పై బయటికి రావడానికి రెండు నెలల సమయం పట్టింది. అనారోగ్యం పేరిట బెయిల్ పొంది ఎన్నికల్లో ప్రచారం చేసిన స్వయంకృతాపరాధం కారణంగా ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కేవలం విచారణ ఖైదీగా 16 నెలల పాటు కారాగారవాసం చేయాల్సి వచ్చింది. గనుల కుంభకోణంలో అరెస్టయిన గాలి జనార్దన రెడ్డి 2012 మార్చిలో జైలుకు వెళ్లారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేటికీ ఫలితం కన్పించడం లేదు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కామ్‌లో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి ఎ రాజా, ఎంపీ కనిమొళి కూడా ఏడాదిపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. వీరందరితో పోల్చితే ప్రత్యేక కోర్టులో దోషిగా రుజువైనప్పటికీ జయలలిత 21 రోజుల్లోనే బెయిల్ పొందడం గమనార్హం.












Click it and Unblock the Notifications