మరో 'సారీ'యా: కెసిఆర్ ఆందోళనకి హరీష్ కారణమా?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన మేనల్లుడు హరీష్ రావుతోనే ఇబ్బందులు వస్తాయా? అంటే తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్ అవుననే అంటున్నారు. తెలంగాణలో తెరాస మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని, తాము అధికారంలోకి వస్తామని చెబుతున్న కెసిఆర్... తమ పార్టీని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్ మరో అడుగు ముందుకేసి... కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావే తెరాసను చీల్చుతారని అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకంలో హరీశ్ రావు నేతృత్వంలో కెసిఆర్ పైన తిరుగుబాటు చేసి ఆ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఈ విషయం తెలియడం వల్లనే కెసిఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. హరీష్ రావు చీలిక తెచ్చే అవకాశం ఉండటం వల్లనే కెసిఆర్... ముందు జాగ్రత్తగా తాను కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తానని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటే తొలుత మద్దతిచ్చేది తామేనని కాంగ్రెసు పార్టీని చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
గతంలో హరీష్ రావు పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారనే వాదనలు ఉన్నాయి. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి కనుక మృతి చెందకుంటే హరీష్ రావు కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే వారనే వాదనలు ఉన్నాయి.
వైయస్‌తో హరీష్ రావు మాట్లాడారని, ఆయన తిరుగుబావుటా ఎగురువేసే సమయానికే వైయస్ మృతి చెందారని గతంలో ఆరోపణలు వచ్చాయి. వీటిని తెరాస ఖండించినప్పటికీ.. అవి అప్పుడు రాజకీయంగా హీటెక్కించాయి. ఇప్పుడు కెసిఆర్ పార్టీ చీలిక అని మాట్లాడటంతో రాజేంద్ర ప్రసాద్.. హరీష్ రావే చీల్చుతారని ఆరోపించడం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications