నారా బ్రాహ్మణి సర్వే: చంద్రబాబుకు తెగ షాక్
హైదరాబాద్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి థర్డ్ పార్టీతో సర్వే చేయించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలను ఆమె చంద్రబాబు ముందు పెట్టినట్లు కూడా చెబుతున్నారు. ఆ ఫలితాలు చూసి చంద్రబాబు షాక్ తిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా బ్రాహ్మణి ఈ సర్వే చేయించారట. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 57 సీట్లకు మించి రావని సర్వేలో తేలినట్లు ప్రచారం సాగుతోంది.

తెలుగుదేశం, బిజెపిలు కలిసి 57 సీట్లు సాధిస్తే మిగతా సీట్లు ప్రతిపక్షాలకు వెళ్తాయని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. అయితే, మిగతా సీట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్తాయా, ఒకవేళ పవన్ కల్యాణ్ బరిలోకి దిగితే జనసేన పార్టీకి వెళ్తాయా అనేది మాత్రం తేల్చలేదట.
ఇచ్చిన హామీలు సరిగా అమలు కాకపోవడం, రాజధాని అంశం అయోమయంగా మారడం, అవినీతి పెరగడం వంటి కారణాలు తెలుగుదేశం పార్టీపై ప్రతికూల ప్రభావం వేస్తున్నాయని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. అయితే, బ్రాహ్మణి సర్వే చేయించినట్లు జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు. ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications