పాత పెద్దనోట్లు: చెక్క సామాగ్రి, ఇటుకలుగా మారతాయా?

Subscribe to Oneindia Telugu

ముంబై: రద్దయిన పెద్ద నోట్లను ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి తన వద్దకు తెప్పించుకుంటోంది. అయితే, భారీ ఎత్తున వచ్చే ఆ నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందనే సందేహం అందరిలోనూ ఉంది. పాత పెద్ద నోట్లను దహనం చేసే అవకాశం లేదని ఆర్బీఐ పేర్కొంది. దీని వల్ల కాలుష్యం తప్ప మరో ప్రయోజనం లేదని భావిస్తోంది.

కాగా, ప్రజల వద్ద ఇంకా మిగిలిపోయిన రూ.500, రూ.1000 నోట్లను డిసెంబర్ 15 వరకు పెట్రోలు బంకులు, ఇతర ప్రభుత్వ కేంద్రా ల్లో చెల్లింపులకు చెలామణి చేసుకోవచ్చు. కానీ ఆ తరువాత తమ వద్దనున్న పెద్దనోట్లను తప్పనిసరిగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. ఇప్పటికే నవంబర్ 8నుంచి డిపాజిట్ అయిన పెద్ద నోట్లు భారీ సంఖ్యలో బ్యాంకుల్లో పోగుపడ్డాయి. ఇలా ట్రక్కుల కొద్దీ పోగవుతున్న పాతనోట్లను ధ్వంసం చేసేందుకు రిజర్వు బ్యాంకు సిద్ధమవుతున్నది. వాటన్నింటినీ నిర్మూలించేందుకు రిజర్వు బ్యాంకుకు కనీసం ఏడాది సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.

రిజర్వు బ్యాంకుకు చెందిన అనేక శాఖల్లో పాత నోట్లను ముక్కలుగా చించివేసే కేంద్రాలున్నాయి. బ్యాంకుల్లో జమవుతున్న పాత నోట్లన్నింటినీ ఆ కేంద్రాలకు పంపుతారు. ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు భారీ సంఖ్యలో వస్తున్నందున ఈ కేంద్రాలు కొంత కాలం తక్కువ విలువున్న నోట్లను ధ్వంసం చేసే పనిని పక్కన పెట్టవచ్చు. రద్దయిన నోట్లను బ్యాంకుల నుంచి సేకరించడం నవంబర్ 14నే మొదలుపెట్టామని, వాటిని ధ్వంసం చేయడం కూడా ప్రారంభించామని రిజర్వు బ్యాంకుకు చెందిన ఒక అధికారి చెప్పారు.

70 శాతం నోట్లే వచ్చేవి..

మొత్తంగా 1800 కోట్ల రూ.1000, రూ.500 నోట్లను మోడీ సర్కారు రద్దుచేసింది. వీటి మొత్తం విలువ రూ.14 లక్షల కోట్లు. వీటిలో 70 శాతానికిపైగా నోట్లు ప్రస్తుతం బ్యాంకుల చెంతకు చేరుతాయని అంచనా. అంటే 1500 కోట్ల నోట్లు వస్తాయన్నమాట. వీటన్నింటినీ భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నుజ్జునుజ్జు చేస్తుంది. దీనికి దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశముంది. మొదటగా వీటిలో నకిలీ నోట్లు ఉన్నాయేమో పరిశీలిస్తారు. తర్వాత కట్టలుకట్టలుగా వేరుచేస్తారు.

Old notes to be made into bricks?

చివరగా వీటిని తునాతునకలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం దేశ వ్యాప్తంగా 19 ఆర్‌బీఐ కేంద్రాల్లో జరుగుతుంది. దీని కోసం 40 పరిశీలన, నుజ్జునుజ్జుచేసే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వీటిని జపాన్‌ లేదా జర్మనీ నుంచి తెప్పిస్తుంటారు. ఇవి గంటలో 2.5 లక్షల నోట్లను ధ్వంసం చేయగలవు.

పని మొదలైంది

పెద్ద నోట్లను రద్దుచేసినట్లు మోడీ సర్కారు ప్రకటించిన ఆరు రోజులకే (నవంబరు 14న) ఈ కేంద్రాలకు నోట్ల తరలింపు ప్రారంభమైంది. ప్రస్తుతం ముంబై, బెలాపూర్‌, నాగ్‌పుర్‌లలో పనులు చకాచకా జరుగుతున్నాయి. ఒక్క ముంబయి నుంచే ఈ కేంద్రాలకు 70,000 నుంచి 80,000 గోనె సంచులతో నగదు వెళ్లే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో చలామణీకి పనికిరాని 62.5 కోట్ల రూ.1,000 నోట్లు, 280 కోట్ల రూ.500 నోట్లను నుజ్జునుజ్జుచేశారు. వీటికి చిన్న నోట్లు అదనం. ప్రస్తుతం పెద్ద నోట్ల తంతు ముగిసే వరకూ చిన్న నోట్లను పక్కన పెట్టేస్తామని అధికారులు వివరించారు. 'మొత్తం నోట్లన్నీ నుజ్జునుజ్జు చేయాలంటే మేం కొంచెం శ్రమపడాలి. రెండు షిఫ్టుల్లో పనిచేయాలి. ఒక్కోసారి పనిఒత్తిడితో యంత్రాలు మొరాయించే అవకాశముంది'అని అధికారులుపేర్కొన్నారు.

ఇదే తొలిసారి

ఈ స్థాయిలో నోట్లను ధ్వంసం చేయడం ఇదే తొలిసారి! 1978లోనూ ఇలాంటి పరిస్థితి వచ్చిన మాట వాస్తవమే. అయితే ఆనాడు చలామణీలో ఉన్న పెద్ద నోట్లు చాలా తక్కువ. దీంతో తాజా ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2001కి ముందు చిరిగిన, చలామణీకి పనికిరాని నోట్లకు నిప్పుపెట్టేవారు. ఈ పద్ధతికి 2003లో స్వస్తి పలికారు.

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ బిమల్‌ జలానే ప్రవేశపెట్టారు. నగదు పరిశీలన, నిర్వహణ పద్ధతి (సీవీపీఎస్‌)ను అమలులోకి తెచ్చారు. దీనిలో మొదట నోట్లను పరిశీలిస్తారు. వీటిలో చలామణీకి పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. ఇంకా నకిలీ నోట్లను వెలికితీస్తారు. అనంతరం నుజ్జునుజ్జు చేస్తారు.

గతంలో అయితే నుజ్జుచేసిన నోట్లతో క్యాలెండర్లు, కాగితాలు ఎగరకుండా పెట్టుకునే వస్తువులు (పేపర్‌ వెయిట్స్‌), ఫైళ్లు, నిప్పురాజేసేందుకు తోడ్పడే దిమ్మలు (బ్రికెట్స్‌) తయారుచేసేవారు. కొన్నింటిని నేలలో సమాధిచేసేవారు. ప్రస్తుతం వీటిని పర్యావరణ హితంగా ఎలా ఉపయోగించాలా? అని అధికారులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు కేరళకు చెందిన ఓ ప్లెవుడ్ కంపెనీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆర్బీఐ శాఖల్లో ధ్వంసం చేసిన నోట్లను గుజ్జుగా మార్చేందుకు ఈ కంపెనీకి పంపారు. 40 టన్నుల చిత్తు నోట్లను ప్రాసెస్ చేసే కాంట్రాక్టును ఈ కంపెనీకి అప్పగించారు. రూ.250కి టన్ను చొప్పున ఆ కంపెనీ చిత్తు నోట్లను గుజ్జుగా మార్చి చెక్కపొట్టుతో కలిపి చెక్క సామగ్రిని తయారు చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Stacks and stacks of 500 and 1,000 rupees notes that are no longer valid, are reaching Reserve Bank of India (RBI) coffers.
Please Wait while comments are loading...