• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌కు ఫోన్, కవిత స్పందనలేదు, ఇప్పుడెందుకు రాహుల్?: స్మృతి ఉద్వేగం

|

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ, హైదరాబాద్‌ కేంద్రీయ శ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సంఘటనలపై విపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొడుతూ ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. దేశ వ్యతిరేకులకు మద్దతు పలుకుతున్నారని మండిపడింది.

పార్లమెంట్‌పై దాడి చేసిన వారివైపు నిలబడతారో, ఆ దాడిని తిప్పికొడుతూ ప్రాణాలర్పించినవారివైపు నిలబడతారో కాంగ్రెస్‌ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. జేఎన్‌యూ, హెచ్‌సీయూ ఘటనలపై అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో బుధవారం పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడికాయి.

పార్లమెంటులో మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ బుధవారం ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దేశ ద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ కుమార్, ఇతర విద్యార్థులు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు జెఎన్‌యూ అధికారులే ధృవీకరించారన్నారు. రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఎదురుదాడికి దిగారు.

Smriti Irani speech in Parliament

కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖమూలంగా తాను జోక్యం చేసుకోవటం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ తీవ్రస్వరంతో దుయ్యబట్టారు.

జెఎన్‌యులో కవితా పఠనానికి హాలు తీసుకుని, భారతదేశం ముర్దాబాద్, భారత సైన్యం ముర్దాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలిస్తే సహించాలా? అంటూ గట్టిగా ప్రశ్నించారు. వీరు అమాయక విద్యార్థులా? వీరిని వదిలి పెట్టాలా? అంటూ స్మృతి ఇరానీ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యారంగాన్ని రాజకీయ యుద్ధక్షేత్రంగా మార్చొద్దని ఆమె ప్రతిపక్షానికి హితవు పలికారు.

కాంగ్రెస్ సహా ప్రతిపక్షం, అధికార పక్షానికి చెందిన వేలాదిమంది వివిధ అంశాలపై రాసే లేఖలపై తాను చర్య తీసుకుంటాననేది మీ అందరికీ తెలుసంటూ విరుచుకుపడ్డారు. విద్యారంగాన్ని రాజకీయం చేసి, విద్యార్థులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే జెఎన్‌యు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలివ్వకుండా మరో నినాదాలిస్తారా? అని ఆగ్రహంతో ఊగిపోయారు. రోహిత్ మృతదేహాన్ని రాజకీయానికి వాడుకునే వారివల్లే దేశానికి కీడు సంభవిస్తోందన్నారు.

‘మానవ వనరుల మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వర్తించాను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పేది లేదు' అని తేల్చి చెప్పారు. ‘అనేకమంది ఎంపీలు వివిధ అంశాలపై లేఖలు రాస్తుంటారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సంస్థలకు మా శాఖ లేఖలు రాస్తుంది. మీరందరి లేఖలపై చర్య తీసుకున్నందుకు నాపై ఆరోపణలు చేస్తారా?' అంటూ నిలదీశారు.

సెంట్రల్ స్కూళ్లలో సీట్లకోసం మీరు లేఖలు రాస్తే పని చేయలేదా? అంటూ ప్రశ్నించారు. తాను చెబుతున్నది వినకుండా ప్రతిపక్ష సభ్యులు ఎందుకు బయటకు వెళ్తున్నారంటూ నిలదీశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్ వర్శిటీకి, జెఎన్‌యుకి రెండుసార్లు రాజకీయం చేసేందుకే వెళ్లారంటూ దుయ్యబట్టారు. రోహిత్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న వారంతా యూపీఏ ప్రభుత్వంలో నియమితులైన వారేనని ఆమె గుర్తు చేశారు.

Smriti Irani speech in Parliament

మైనారిటీలకు తమ ప్రభుత్వం రక్షణ ఇవ్వదంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కాశ్మీర్‌కు చెందిన ఒక విద్యార్థి ఎక్బాల్ రసూల్ ఉపకార వేతనం సమస్యను తాను ఎలా పరిష్కరించిందీ వివరించారు. ‘ప్రతి సభ్యుడు చేసిన ఆరోపణకు నావద్ద సమాధానం ఉంది. మీరు ఓపికగా వింటే చాలు' అంటూ ఆవేశంతో అన్నారు. విద్యార్థులతో రాజకీయం చేయటం మానుకోవాలని హితవు పలికారు.

‘విద్యారంగాన్ని రాజకీయం చేసి నాపై నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు సమాధానమిస్తుంటే వెళ్లిపోతారా?' అని నిలదీశారు. ‘విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే శిలువెక్కిస్తారా?' అంటూ ఎంపీలు జ్యోతిరాధిత్య సింధియా, శశిథరూర్, అసదుద్దీన్ ఓవైసీ, పప్పుయాదవ్ తదితర నేతలను నిలదీశారు.

‘నా పేరు స్మృతి ఇరానీ. మీకు సవాల్ చేస్తున్నాను. నా కులమేంటో మీరు చెప్పగలరా?' అంటూ ఆమె ప్రతిపక్షాన్ని నిలదీశారు. కులం, మతం పేరిట తానెప్పుడూ పని చేయలేదని ఆవేశంతో ప్రకటించారు. జేఎన్‌యూ ఆవరణలో అవాంఛిత కార్యకలాపాలు జరగుతున్నాయన్న తన వాదనకు మద్దతుగా ఆమె ‘మహిషాసుర దినోత్సవం' జరిపిన సంఘటనను ప్రస్తావించారు.

ఆ కార్యక్రమంలో దుర్గాదేవిని కించపరిచే విధంగా చిత్రీకరించారని ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా ఆమె కరపత్రాలను చూపించారు. ఈ అంశంపై చర్చకు రావాలని, ఈ కరపత్రాలను పశ్చిమ్‌బంగలో చూపించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు.

కెసిఆర్‌కు ఫోన్ చేశా

రోహిత్ ఆత్మహత్య వివరాలు తెలియగానే తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావుకు తాను టెలిఫోన్ చేస్తే ఆయన తీరిక లేకుండా ఉన్నారని సమాధానం వచ్చిందన్నారు. ఈ కాల్‌కు సంబంధించిన రికార్డు తనవద్ద ఉందంటూ స్మృతి వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు టెలిఫోన్ చేశాను. కానీ ఆయన మాట్లాడలేదన్నారు. కెసిఆర్ ఈరోజు వరకూ తనకు అందుబాటులోకి రాలేదన్నారు.

కెసిఆర్ కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు కవితకూ టెలిఫోన్ చేశానని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. ఆమె నుంచి కూడా స్పందన రాలేదన్నారు. రోహిత్ ఆత్మహత్యపై స్థానిక పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం అతని గది తెరిచి ఉందన్నారు. రోహిత్ తన లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని రాశాడని వివరించారు.

కాగా, ఈ సందర్భంలో టిఆర్ఎస్ పక్షం నాయకుడు జతేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. దానికి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ.. రోహిత్‌ను వైద్యుల వద్దకు తీసుకుపోయేందుకు అనుమతించలేదని తెలంగాణ పోలీసులు చెప్పారని గుర్తు చేశారు.

Smriti Irani speech in Parliament

రోహిత్ మరణించాడని ఎవరు ప్రకటించారు? వైద్యులా? లేక రాజకీయం చేయాలనుకుంటున్న విద్యార్థులా? అని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒకేచోటికి రెండుసార్లు ఎప్పుడైనా వెళ్లారా? లేదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలమంది విద్యార్థులు మరణిస్తే రాహుల్ వెళ్లలేదు. కానీ రోహిత్ వద్దకు రెండుసార్లు వెళ్లడంలో ఆయన రాజకీయ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

దేశ ద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కవితా పఠనానికి జెఎన్‌యులో హాల్ బుక్‌చేసి.. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణార్థం సభ నిర్వహించారన్నారు. అఫ్జల్‌ గురును ఉరితీయడం న్యాయవ్యవస్థ చేసిన హత్య అని వారు వర్ణించారని, ఇది సుప్రీంకోర్టుకు, భారత దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేయడంతో సమానమని అన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే విద్యార్థుల మనస్సులు ఇలా తయారయ్యాయని, విద్యను రణక్షేత్రంగా మార్చవద్దని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.

అఫ్జల్ గురు, మక్బూల్ భట్ జిందాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, ఇండియా గోబ్యాక్, భారత సైన్యం ముర్దాబాద్ అంటూ ఆ విద్యార్థులు నినాదాలిచ్చారన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేస్తాం. నాశనం కావాలంటూ నినాదాలిచ్చే వారిని సహించాలా? అని స్మృతి నిలదీశారు. ‘మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయ వ్యవస్థను పని చేయనివ్వండి. బాధితులకు న్యాయం కలుగుతుంది' అని స్మృతి ఇరానీ ఉద్వేగంతో అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Smriti Irani responded on JNU and HCU issues in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more