'చిరు' పొరపాటు, తప్పించుకుంటున్న పవన్ కళ్యాణ్!
విజయవాడ: కాపు రిజర్వేషన్లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పైన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో... చంద్రబాబుతో పాటు మెగా సోదరులు కూడా కాపులకు టార్గెట్‌గా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ల కోసం కాపులు తీవ్రంగా ఉద్యమిస్తుంటే వారి నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేదని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కాపు రిజర్వేషన్ల పైన గతంలో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఒకటికి రెండుసార్లు చిరంజీవి స్పందించారు. రెండు రోజుల క్రితం కూడా చిరంజీవి మాట్లాడారు.
అయితే, ఆశించిన స్థాయిలో స్పందన లేనట్లుగా ఉందని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీని కాపు ఆందోళనలు అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. తమ సామాజివర్గానికే చెందిన కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భాగస్వాములు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని కాపు వర్గాలు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో దీక్ష చేసి, సభ నిర్వహించిన కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యపరిస్థితిపై ఆ సామాజికవర్గంలో ఆందోళన కలిగిస్తోంది. బంద్ పిలుపు ఇవ్వగా ఉదయం నుంచే దుకాణాలు బందు చేయడం బట్టి, నిరసన స్థాయి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోందంటున్నారు.
పోలీసులు ఎంత నిర్బంధించినా కాపులు రోడ్లమీదకు వస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇంకా ఆ తీవ్రత మొదలుకాకపోయినా, కాపు సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాపు జాతి ప్రయోజనాల కోసం ఒకవైపు ముద్రగడ, ఆయనకు మద్దతుగా తామంతా ప్రత్యక్ష కార్యాచరణలో దిగితే, తమ వర్గానికి చెందిన చిరంజీవి, పవన్ మాత్రం ఆశించిన మేర స్పందించడం లేదని వాపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ముద్రగడ దీక్ష, కాపులను బీసీ హోదాలో చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిరంజీవి లేఖ రాసిన వైనం కాపు వర్గాల్లో చర్చనీయాంశమయింది. కాపువర్గానికి చెందని సీపీఐ నారాయణ సైతం ముద్రగడ ఆందోళన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీరును విమర్శించారు.
పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని...
ఏ సమస్యనూ పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చి జీరోగా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపి వీ హనుమంత రావు కూడా పవన్ ట్వీట్లతో కాలక్షేపం చేయకుండా, అక్కడికి వెళ్లి ముద్రగడ దీక్షకు మద్దతునీయాలన్నారు. వైసిపి నేత అంబటి రాంబాబు కూడా పవన్‌ను లాగారు.
తనకు కులం అంటకట్టవద్దని, తాను అందరివాడినని గతంలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే, దానిపై విమర్శలు రావడంతో మళ్లీ ముద్రగడ లేవనెత్తిన అంశాలతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, నమ్మిన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే, చంద్రబాబును కలిసిన సందర్భంలో భూముల విషయంలో చర్చించిన పవన్, సొంత సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ప్రస్తావించలేదంటున్నారు.
చిరంజీవి అప్పుడే హామీ తీసుకొని ఉంటే..
కాపుల సమస్యలపై చిరంజీవి కేవలం లేఖలు రాసి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని వాపోతున్నారంటున్నారు. తన పార్టీని విలీనం చేసేముందు కాపులను బీసీల్లో చేర్చాలన్న షరతు విధిస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి అప్పుడే షరతు విధించి, విలీనం చేసి ఉంటే తమకు ఈ దుస్థితి పట్టేది కాదంటున్నారు. ముద్రగడ ఆమరణ దీక్షకే స్పందించని ప్రభుత్వం చిరంజీవి లేఖకు స్పందిస్తుందనుకోవడం భ్రమేనని కాపునేతలు అంటున్నారు. తాను కూడా కాపులకు ఏదో చేస్తున్నాననిపించుకోవడానికే తప్ప, చిత్తశుద్ధి ఉంటే చిరంజీవి కూడా దీక్షకు దిగాలని సూచిస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications