జగన్ పాదయాత్ర ట్విస్ట్: తేదీపై మీమాంస, వాళ్లేమో వద్దంటున్నారు?..
ఆరోజు గనుకు పాదయాత్ర మొదలుపెడితే దానివల్ల డ్యామేజీ తప్ప కొత్తగా ఒనగూరేది ఏమి ఉండదని తేల్చి చెప్పారట.
హైదరాబాద్: చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు.
ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు వంటి వాటిని నమ్మాల్సి వస్తుందేమో!. అందుకే త్వరలో మొదలుపెట్టబోయే పాదయాత్ర కోసం పక్కాగా ముహూర్తం చూసుకుంటున్నారట జగన్.

ఆరోజు మంచిది కాదని?:
నిజానికి అక్టోబర్ 27నుంచి పాదయాత్ర చేయాలని జగన్ భావించారు. ఇదే విషయమై జ్యోతిష్యులను సంప్రదిస్తే.. అది ఏమాత్రం శుభం కాదని వారు కుండబద్దలు కొట్టారట. ఆరోజు గనుకు పాదయాత్ర మొదలుపెడితే దానివల్ల డ్యామేజీ తప్ప కొత్తగా ఒనగూరేది ఏమి ఉండదని తేల్చి చెప్పారట.
Recommended Video


శాస్త్రోక్తంగా ప్రారంభించాలనే:
అధికారం కోసం ఎంత చేయాలో.. అంతా చేస్తున్న జగన్.. చివరి అస్త్రంగా పాదయాత్రను సంధించబోతున్నారు. పాదయాత్రతోనే అటు పార్టీ ఇమేజ్, ఇటు తన ఇమేజ్ పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు.
2019ఎన్నికలు వైసీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం కావడంతో.. పాదయాత్రను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాదయాత్రను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తే శుభం కలుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జ్యోతిష్యుల్ని సంప్రదించి సలహాలు కోరారట.

తేదీ మార్పు:
అక్టోబర్ 27న పాదయాత్ర మొదలుపెట్టడం ఏవిధంగాను లాభించదని జ్యోతిష్యులు జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా నవంబర్ 1, లేదా నవంబర్ 2 తేదీల్లో పాదయాత్ర మొదలుపెట్టడం మంచిదని సూచించినట్లు సమాచారం. దీంతో జగన్ తన పాదయాత్ర తేదీ పట్ల పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

కోర్టు అడ్డంకి:
పాదయాత్ర చేపట్టాల్సి ఉన్నందున ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్ర సమయంలోను ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి. అలాగే సీబీఐ కేసు నుంచి తన పేరు తొలగించాలన్న అభ్యర్థనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

క్రిస్టియన్ కదా.. ఈ పట్టింపులెందుకు?
నిజానికి జగన్ క్రిస్టియన్ మతానికి చెందినవారు కదా.. ఆయనకు ఈ పట్టింపులు ఎందుకు అనేవారు లేకపోలేదు. కానీ సీఎం సీటే లక్ష్యంగా సాగుతున్న జగన్.. ప్రతీ విషయంలోను ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. శాస్త్రోక్తంగా మొదలుపెడితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చునేమో అన్న పాజిటివ్ కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. చూడాలి మరి.. జగన్ ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో!












Click it and Unblock the Notifications