ఆ సర్జరీలకు ఇన్సూరెన్స్ షాక్ లు..! గాల్లో రోగుల ప్రాణాలు..! తాజా సర్వే..!
ఒబెసిటీ అండ్ మెటాబోలిక్ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో 95.4 శాతం మంది సర్జన్లు తమ రోగులు బీమా ఆమోదం కోసం ఎదురుచూస్తూ బారియాట్రిక్, మెటాబోలిక్ సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారని నివేదించారు.
భారత దేశంలో ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న జబ్బుల్లో స్థూలకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు ఉంటున్నాయి. ఇలా స్థూలకాయం, జీవక్రియ సంబంధిత జబ్బుల శస్త్రచికిత్సల కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించకపోవడంతో 95 శాతం రోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని సర్వే నివేదిక హెచ్చరించింది.
ఒబెసిటీ అండ్ మెటాబోలిక్ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో 95.4 శాతం మంది సర్జన్లు తమ రోగులు బీమా (insurance) ఆమోదం కోసం ఎదురుచూస్తూ బారియాట్రిక్, మెటాబోలిక్ సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారని నివేదించారు. ముంబైలోని సైఫీ హాస్పిటల్‌కు చెందిన బారియాట్రిక్, మెటాబోలిక్ సర్జన్ డాక్టర్ అపర్ణ గోవిల్ భాస్కర్, దేశంలోని ఇతర సీనియర్ సర్జన్లతో కలిసి ఈ పరిశోధనను నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను "జర్నల్ ఆఫ్ మెటాబోలిక్ సర్జరీ అండ్ అలైడ్ కేర్" ప్రచురించింది.

గత సంవత్సరం ప్రారంభమైన ఈ సర్వే ఈ ఏడాది మార్చిలో పూర్తయింది. ఇందులో దేశవ్యాప్తంగా కనీసం 109 మంది సర్జన్లను సర్వే చేశారు. వీరు మెటాబోలిక్, బారియాట్రిక్ సర్జరీలకు బీమా ఆమోదాలకు సంబంధించి సర్జన్ల అనుభవాలను అంచనా వేయడం, రీయింబర్స్‌మెంట్ ప్రక్రియలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను గుర్తించడం, బీమా కవరేజ్ రోగులకు చికిత్స అందుబాటుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడమే లక్ష్యంగా సర్వే నిర్వహించారు.
నిబంధనల ప్రకారం మెటాబోలిక్, బారియాట్రిక్ సర్జరీలకు బీమా కవరేజ్ తప్పనిసరి చేయాలని 2019లో బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలు మాత్రం రోగులకు ఇన్సూరెన్స్ అందించడంలో చేస్తున్న ఆలస్యంతో వారు సర్జీల్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు 76 శాతం మంది సర్జన్లు రోగులకు బారియాట్రిక్ సర్జరీలకు బీమా కవరేజ్ లభిస్తుందని కూడా తెలియదని సర్వేలో వెల్లడించారు. వైద్య నిబంధనలు పాటించినప్పటికీ ఇన్సూరెన్స్ ఆమోద ప్రక్రియ చాలా కష్టంగా ఉందని ఆరోపించారు. 69.7 శాతం మంది దీనిని క్లిష్టమైనదిగా రేట్ చేయగా, 91.7 శాతం మంది ఇతర సాధారణ సర్జరీల ఆమోదాల కంటే ఇది మరింత కష్టమైనదని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో స్థూలకాయం అనేది ఓ భయంకరమైన సమస్యగా మారుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో అధిక బరువు, స్థూలకాయం 2005-2006లో 12.6 శాతం నుండి 2019-2021 నాటికి 24 శాతానికి పెరిగింది. అదే వయస్సు వర్గం పురుషులలో ఈ శాతం 9.3 నుండి 22.9 శాతానికి పెరిగింది. అయితే బారియాట్రిక్, మెటాబోలిక్ సర్జరీ అనేది తీవ్రమైన స్థూలకాయానికి సమర్థవంతమైన చికిత్స ఎంపికలలో ఒకటి. ఇది మొత్తం శరీర బరువును 30 నుండి 40 శాతం తగ్గించి, సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.












Click it and Unblock the Notifications