సండే స్పెషల్.. "దూపుడు పోతు బిర్యానీ" ట్రై చేస్తారా ???
ఘాటైన నాటు మసాలాలు.. గుమగుమలాడే నెయ్యి వాసన.. మెత్తటి మాంసం ముక్కలు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రాయలసీమ సంప్రదాయ వంటకం దూపుడు పోతు బిర్యానీ. ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని ఇచ్చేది అందులో వాడే నాటు మసాలాలు, నెయ్యి, పుదీనా, కొత్తిమీర. మాంసాన్ని ముందుగానే మసాలాలతో బాగా నానబెట్టి, తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించడం వల్ల రుచులు లోపలికి బాగా చేరతాయి. ఆ తర్వాత అన్నంతో కలిపి దమ్ పెట్టడం వల్ల బిర్యానీకి మంచి సువాసన వస్తుంది. మరి ఈ స్పెషల్ బిర్యానీని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
రాయలసీమ వంటకాలకే ప్రత్యేకమైన రుచి!
ఆంధ్రప్రదేశ్లో వంటకాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఘాటైన రుచులు, నాటు మసాలాలతో చేసే మాంసాహార వంటకాలే. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో దూపుడు పోతు బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ మటన్ బిర్యానీకి భిన్నంగా, లేత పొట్టేలు మాంసంతో తయారు చేసే ఈ బిర్యానీ రుచిలోనూ, తయారీలోనూ ప్రత్యేకతను చాటుకుంటుంది. మాంసం ముక్కలు మెత్తగా ఉడికి, మసాలాలు బాగా పట్టడంతో ప్రతి ముద్దా ఎంతో రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు...
దూపుడు పోతు మాంసం - 1 కేజీ
బాస్మతి బియ్యం లేదా చిట్టి ముత్యాలు - 1 కేజీ
ఉల్లిపాయలు - 4 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టీస్పూన్లు
పెరుగు - 1 కప్పు
నూనె, నెయ్యి - తగినంత
పుదీనా, కొత్తిమీర - ఒక్కో కట్ట
నిమ్మరసం - 4 టీస్పూన్లు
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ
కారం - 2 టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - తగినంత
గరం మసాలా - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కుంకుమపువ్వు నానబెట్టిన నీళ్లు - కొద్దిగా
తయారీ విధానం..
ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, కొద్దిగా నూనె, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ మాంసానికి పట్టేలా కలిపి కనీసం రెండు గంటల పాటు పక్కన పెట్టాలి. సమయం ఉంటే నాలుగు గంటలు ఫ్రిజ్లో ఉంచితే మరింత బాగుంటుంది.
బాస్మతి బియ్యాన్ని లేదా చిట్టి ముత్యాలను శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఒక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఉప్పు వేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి సుమారు 70 శాతం ఉడికించాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బిర్యానీ పాత్రను తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. బిర్యానీ దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పచ్చిమిర్చి వేసి కలిపిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మాంసాన్ని జోడించాలి.
మొదట పది నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించి, ఆ తర్వాత మూత పెట్టి మాంసం మెత్తబడే వరకు ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు పోయాలి. మాంసం పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర చల్లాలి.
మాంసం మసాలా సిద్ధమైన తర్వాత దానిపై ఉడికించిన బియ్యాన్ని సమానంగా పరచాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు నీళ్లు, పుదీనా, కొత్తిమీర చల్లాలి. ఇలా పొరలుగా అమర్చడం వల్ల అన్నానికి మసాలాల సువాసన బాగా పడుతుంది.
ఇప్పుడు పాత్రకు మూత పెట్టి గోధుమ పిండితో అంచులను గట్టిగా మూసివేయాలి. మొదట కొద్దిసేపు మధ్యస్థ మంటపై ఉంచి, ఆ తర్వాత సన్నని మంటపై సుమారు 15 నుంచి 20 నిమిషాలు దమ్ పెట్టాలి. స్టవ్ ఆపిన తర్వాత మరో పది నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్నం, మాంసం, మసాలాల రుచులు ఒకదానితో ఒకటి కలుస్తాయి.
అంతే.. ఘుమఘుమలాడే రాయలసీమ స్పెషల్ దూపుడు పోతు బిర్యానీ సిద్ధం. మాంసం ముక్కలు మెత్తగా, అన్నం పొడిపొడిగా ఉండే ఈ బిర్యానీని వేడివేడిగా వడ్డిస్తే ఆ రుచే వేరు. దీనికి తోడుగా మిర్చి కా సాలన్, ఉల్లిపాయ పెరుగు పచ్చడి లేదా రాయితా అందిస్తే భోజనం మరింత ప్రత్యేకంగా మారుతుంది.












Click it and Unblock the Notifications
