ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు.. ఆరోగ్య శాఖ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.!
ఇడ్లీ... పేరు వింటేనే నోరూరించే ఆహారం. దక్షిణ భారతదేశంలో ఇది ఒక ముఖ్యమైన ఆహారం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇష్టమైన అల్పాహారం కూడా. పేద, ధనిక అనే తేడా లేకుండా, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇడ్లీని సాంబార్‌తో కలిపి తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్‌ను అందించే ఈ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఇడ్లీని తయారు చేయడానికి నూనె లేదా ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. అందుకే చాలామంది ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఇడ్లీని ఎంచుకుంటారు.
కానీ, బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక సంచలన విషయం ఇడ్లీ ప్రియులను షాక్‌కు గురిచేసింది. బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన అధ్యయనంలో కొన్ని రెస్టారెంట్లు , వీధి వ్యాపారులు ఇడ్లీలను తయారుచేసే విధానం క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదం ఉందని తేలింది. ఈ వార్త ఇడ్లీ ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేస్తుంది..

ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడైన నిజాలు:
బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు నగరంలోని హోటళ్లు ,వీధి వ్యాపారులు ఇడ్లీలను ఎలా తయారుచేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దీనిలో భాగంగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఇడ్లీ నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో విసృతపోయే విషయాలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక ఇడ్లీ నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
దాదాపు 500 ఇడ్లీ నమూనాలను పరీక్షించిన ఆరోగ్య శాఖ, వాటిలో 35 నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ రసాయనాలు వినియోగదారులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వందలాది నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఫలితాలు ఇప్పుడు అందరిని ఆందోళన కలిగిస్తుంది.
క్యాన్సర్ కారకాలకు కారణం ఏమిటి?:
కలుషితమైన ఇడ్లీ నమూనాలను గుర్తించిన తరువాత, ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఇడ్లీలను తయారుచేసిన హోటళ్లు , వ్యాపారులను సందర్శించి వారి తయారీ విధానాలను నిశితంగా పరిశీలించారు. సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో, ఇడ్లీ పిండిని శుభ్రమైన కాటన్ వస్త్రాలపై వేసి, ఆపై ఇడ్లీ ట్రేలపై పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. కానీ, చాలా హోటళ్లు , వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, అధిక వేడికి ప్లాస్టిక్ గురైనప్పుడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనాలలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు కనుగొనబడ్డాయని అధికారులు భావిస్తున్నారు.
వినియోగదారుల్లో ఆందోళన:
ఈ వార్త వెలువడిన వెంటనే ఇడ్లీ వినియోగదారులలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ప్రజలు తమకు ఇష్టమైన ఇడ్లీని తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన నమూనాల పూర్తి నివేదిక కోసం ఆరోగ్య శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మిగిలిన నివేదికలు కూడా ఇలాగే వస్తే, ఆహార పరిశ్రమలో ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించే అవకాశం ఉంది. అటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు దీనిపై స్పందించారు. ఆహార తయారీలో, ముఖ్యంగా ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో వైపు వెంటనే ఆహార తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించాలని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications