" గులాబ్ జామ్ " ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..?
గులాబ్ జామున్.. వీటికి భారతీయ స్వీట్స్ లలో అత్యంత ప్రాచుర్యం ఉంది. రసంతో నిండిన చిన్న చిన్న జామున్లు నోట్లో వేసుకుంటే చాలు... క్షణాల్లో కరిగిపోతాయి. అందరికీ ఇష్టమైన ఈ స్వీట్ పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు.. ఇలా ఏ సందర్భమైనా గులాబ్ జామున్ లేకపోతే ఆ ప్లేట్ అసంపూర్ణంగా అనిపిస్తుంది.
ఇంట్లో సులువుగా, రుచికరంగా తయారు చేసుకునే స్వీట్‌లలో గులాబ్ జామ్ ఒకటి. మృదువుగా, సిరప్‌లో మునిగిపోయి నోట్లో కరిగిపోయే ఈ స్వీట్‌ను ఒక్కసారి సరైన విధానంలో చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు గులాబ్ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, స్టెప్ బై స్టెప్ విధానం... అలాగే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..
గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ - 1 కప్పు లేదా ఒక ప్యాకెట్
పాలు లేదా నీరు - అవసరమైనంత (సుమారు ¼ నుండి ½ కప్పు)
పంచదార - 2 కప్పులు
నీరు - 2 నుండి 2.5 కప్పులు
యాలకుల పొడి - ½ టీస్పూన్
నెయ్యి లేదా నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నిమ్మరసం - 1 టీస్పూన్ (ఐచ్ఛికం)
గులాబ్ జల్ లేదా కుంకుమపువ్వు - ఐచ్ఛికం (సువాసన కోసం)
తయారీ విధానం..
షుగర్ సిరప్ :
- ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో పంచదార, నీరు పోసి మధ్యస్థ మంటపై ఉంచాలి. పంచదార పూర్తిగా కరిగే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించాలి.
- సిరప్ మరిగిన తర్వాత యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా గులాబ్ జల్ లేదా కుంకుమపువ్వు వేసుకోవచ్చు. నిమ్మరసం వేసితే సిరప్ క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది.
- ఈ సిరప్ కొద్దిగా జిగురుగా ఉండే స్థాయిలో సరిపోతుంది. చివరగా పొయ్యి ఆపి, గోరువెచ్చగా ఉండేలా పక్కన పెట్టాలి.
గులాబ్ జామ్ పిండి తయారీ :
- ఒక మిక్సింగ్ బౌల్‌లో గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకోవాలి. అందులో కొద్దికొద్దిగా పాలు లేదా నీరు పోస్తూ చేత్తో మెల్లగా కలపాలి.
- ఈ దశలో పిండిని చపాతీ పిండిలా గట్టిగా పిసకకూడదు. పిండి మెత్తగా, కొంచెం జిగురుగా ఉండాలి.
- పిండి సిద్ధమైన తర్వాత 10-15 నిమిషాలు కవర్ చేసి విశ్రాంతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జామున్లు వేయించినప్పుడు పగలకుండా ఉంటాయి.
ఉండలు చేయడం :
- విశ్రాంతి ఇచ్చిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకొని, పిండిని చిన్న చిన్న సమాన పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
- ఉండలపై ఎలాంటి చీలికలు (cracks) లేకుండా నున్నగా ఉండేలా చూసుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ గులాబ్ జామున్లకు ముఖ్యమైన స్టెప్.
వేయించడం :
- ఒక కడాయిలో నెయ్యి లేదా నూనె పోసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదు.
- నూనె సరైన ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, కొన్ని జామున్లు మాత్రమే వేసి నెమ్మదిగా వేయించాలి. తక్కువ మంటపై వేయిస్తే జామున్లు లోపల వరకు బాగా ఉడుకుతాయి.
- బంగారు రంగు వచ్చిన తర్వాత వాటిని నూనె నుంచి తీసి, వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్‌లో వేయాలి.
సిరప్‌లో నానబెట్టడం :
- అన్ని జామున్లు సిరప్‌లో వేసిన తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. ఈ సమయంలో అవి సిరప్‌ను బాగా పీల్చుకుని పరిమాణంలో రెట్టింపు అవుతాయి.
- మరింత జ్యూసీగా కావాలంటే రాత్రంతా కూడా నానబెట్టవచ్చు.
చిట్కాలు..
పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి.
నూనె లేదా నెయ్యి తక్కువ మంటపై మాత్రమే వేడి చేయాలి.
వేయించిన వెంటనే చల్లని సిరప్‌లో వేయకూడదు, సిరప్ గోరువెచ్చగా ఉండాలి.
జామున్లు పగిలితే పిండి తేమ తక్కువగా ఉందని అర్థం - కొద్దిగా పాలు చేర్చాలి.
కావాలంటే వెనిల్లా ఐస్‌క్రీమ్‌తో కలిపి డెజర్ట్‌లా కూడా ఆస్వాదించవచ్చు.












Click it and Unblock the Notifications