ప్రీ-డయాబెటిస్ సంకేతాలు .. మధుమేహంగా మారకుండా, కట్టడి ఇలా..!!
డయాబెటీస్. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బాధ పడుతున్నారు. ఒత్తిడి.. ఆహారం.. జీవన శైలి ఈ తరహాలో డయాబెటీస్ పెరగటానికి కారణాలుగా ఉంటున్నాయి. కూర్చుని చేసే పనే అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్తువతో కాలం గడిపేస్తున్నారు. పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగాయని, డయాబెటిస్ కు దగ్గరలో ఉన్నారని చెబుతున్నారు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. పూర్తి స్థాయి డయాబెటీస్ గా మారుగుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెబుతున్నారు. సంకేతాల సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.
ప్రీ-డయాబెటిస్ అనేది మెటబాలిక్ సిండ్రోమ్. ఇందులోనూ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే డయాబెటిస్ గుర్తించేంత స్థాయిలో ఉండవని, అలాగే నార్మల్ గానూ ఉండవు. జీవన శైలి లో మార్పులు లేకుంటే, ప్రీ డయాబెటిస్ ఉన్న పెద్దలు, పిల్లలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రీ డయాబెటీస్ లో కొన్ని సంకేతాలు కనబడతాయని.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం, శక్తి, ఉత్సాహం తగ్గిపోవడం,జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించడం, సరిగా ఆలోచించలేకపోవటం, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించడం, నిద్రలేమి సమస్య వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రీ డయాబెటిస్ అనేది ముందస్తే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి అని టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.

వీరికీ రక్తనాళాలు గట్టిపడటం, పూడికలు ఏర్పడడం 40 శాతం వరకూ పెరుగుతున్నట్టు పలు పరిశోధనల్లో వెల్లడైంది. మరి కొందరిలో నాడులూ దెబ్బతింటున్నాయని పేర్కొన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు, పని ఒత్తిడి, స్మార్ట్ పరికరాలు తెచ్చిపెడుతున్న నిద్రలేమి, శరీరంలో హార్మోన్లు గతి తప్పటానికీ దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రీ డయాబెటీస్ ఉన్నవారు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దంపుడు బియ్యం, గోధుమలు, జొన్నల లాంటి పొట్టు తీయని ధాన్యాలు తినొచ్చని సూచిస్తున్నారు. వీటిలోని పీచు గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవకుండా చేస్తుందని పేర్కొన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేలా చూసుకోవాలి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ పూర్తి స్థాయి డయాబెటీస్ గా మారకుండా ఉండేందుకు ఆహార నియమాలు, వ్యాయామం లాంటివి పాటించాలి. మరి, అవసరమైతే మెడిసిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications