ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా - కేంద్ర మంత్రి సంచలనం..!!
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆందోళన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు పైనా సందిగ్ధత కొనసాగుతోంది. సీఈసీ వివాదం పైన కాంగ్రెస్ కొత్త వ్యూహం సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కేంద్రంలో.. బీహార్ ప్రభుత్వంలో ఎల్‌జేపీ(ఆర్వీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిహార్‌లో మహిళల పట్ల నేరాలు పెరిగిపోతుండటంపై చిరాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను బిహార్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగ స్వామి గా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానన్నారు. ఇటీవల జమూయ్, సమస్తిపూర్, బంకా, తదితర జిల్లాల్లో మైనర్ బాలికల మీద వరుసగా జరిగిన అత్యాచార యత్నాలను ఆయన ప్రస్తావించారు. ఇవి దేశవ్యాప్తంగా బిహార్ పరువు తీశాయన్నారు. ఏ బాలిక మీదైనా చేయి వేయడానికి నేరగాళ్లు వణికిపోయే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పారు. పోలీసులు అంటే భయం లేకుండా పోయిందని, ఇలా ఉంటే శాంతి భద్రతలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. కూటమి భాగస్వామిగా మాట్లాడినందుకు తనకు నోటీసు ఇచ్చినా, తనను పదవి నుంచి పీకేసినా భయపడేది లేదన్నారు.

బీహార్ లో పరిణామాల పై ఆగ్రహం
కాగా, రెండు రోజుల క్రితం ఆయన ఎన్నికల సంఘం(ఈసీ) విషయంలోనూ ఎన్డీఏ కూటమి వైఖరికి భిన్నంగా మాట్లాడారు. వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన గుడ్డిగా ఎవర్నీ సమర్థించే ప్రసక్తే లేదని చెప్పారు. బిహార్ సంకీర్ణ భాగస్వామి అయిన ఎల్‌జేపీకి 19మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీల బలం ఉంది. అయితే.. పాశ్వాన్ అభ్యంతరాల పైన ప్రభుత్వంలో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్రంలోనూ కీలక మంత్రాంగం కొనసాగుతోంది. బీహార్ లో చోటు చేసుకున్న ఘటనల పైన ఆరా తీసినట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దిశగా కసరత్తు కొనసాగుతోంది. దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పైనా చర్చ జరుగుతోంది. దీంతో.. అక్టోబర్ మాసంలో రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications
