ఇంజిన్ ఫెయిల్ అయినా తగ్గేదేలే.. చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్ రాకెట్!
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్ వ్యవస్థగా పేరుగాంచిన ఎలన్ మస్క్ సారథ్యంలోని 'స్పేస్‌ఎక్స్' (SpaceX) మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మనిషిని చంద్రుడిపైకి, అటుపై మార్స్ పైకి చేరవేయాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యంతో రూపొందించిన భారీ రాకెట్ 'స్టార్‌షిప్' (Starship) తొలిసారి విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది. టెక్సాస్‌లోని స్పేస్‌బేస్ నుంచి మొత్తం 124 మీటర్ల ఎత్తు ఉండే ఈ భారీ రాకెట్‌ను 14వ సారి ప్రయోగించగా, ఈసారి ప్రయోగం విజయవంతమైంది.
ఈ ప్రయోగం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో ఒక ఇంజిన్ మధ్యలోనే మొరాయించింది. దీంతో ఇంజనీర్లు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ఇంజిన్ల సహాయంతో రాకెట్‌ను అనుకున్న లక్ష్యానికి చేర్చడంలో సఫలమయ్యారు. నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరుకున్న తర్వాత, సరికొత్త జెనరేషన్ కు చెందిన 26 'స్టార్‌లింక్' ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి జారవిడిచింది. తద్వారా స్టార్‌షిప్ తన తొలి వాణిజ్య ప్రయోగాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది.

స్టార్‌షిప్ ప్రత్యేకత ఏంటి?
ఇది సాధారణ రాకెట్ల లాంటిది కాదు. దీని పరిమాణం, అత్యధిక థ్రస్ట్ (ముందుకు నెట్టే శక్తి), అగ్రగామి రీ-యూజబుల్ (మళ్లీ మళ్లీ వాడే వీలున్న) సాంకేతికత దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భూమి దిగువ కక్ష్యలో తిరగాలంటే గంటకు దాదాపు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. గతంలో చేపట్టిన 13 టెస్ట్ ఫ్లైట్స్ అన్నీ సబ్-ఆర్బిటాల్ (నిర్ణీత కక్ష్యను చేరకుండా తిరిగి భూమిపైకి వచ్చేవి) మార్గంలోనే జరిగాయి. కానీ, ఈసారి మాత్రం స్టార్‌షిప్ సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఆర్బిట్‌లోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
Starship achieved orbit on its first attempt and successfully delivered Starlink V3 satellites to space for the first time → https://t.co/LwJ4g6dNZ3 pic.twitter.com/pnd3k8x6E0
— SpaceX (@SpaceX) September 28, 2026
కుదించుకుపోయిన ప్రయాణ సమయం
వాస్తవానికి ఈ టెస్ట్ ఫ్లైట్ దాదాపు 10 గంటల పాటు సాగాల్సి ఉంది. కానీ, ఇంజిన్ వైఫల్యం కారణంగా మిషన్‌ను కేవలం మూడు గంటలకే కుదించాల్సి వచ్చింది. అయినప్పటికీ, కక్ష్యలోకి చేరడం, శాటిలైట్లను విజయవంతంగా మోహరించడం వంటి ప్రధాన లక్ష్యాలన్నీ నెరవేరడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్‌కు చెందిన 'సూపర్ హెవీ బూస్టర్' కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా మెక్సికో గల్ఫ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రధాన అంతరిక్ష నౌక మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది.
Views from of one of the first 26 Starlink V3 satellites successfully deployed to orbit by Starship
— Starlink (@Starlink) September 28, 2026
Thanks for the ride, @SpaceX! pic.twitter.com/B2SSUA0N0q
చంద్రుడు, అంగారకుడే లక్ష్యంగా...
ఈ విజయంతో స్పేస్‌ఎక్స్ తన భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి విశ్వాసంతో ఉంది. రాబోయే రోజుల్లో మానవులను, భారీ సామాగ్రిని చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి సురక్షితంగా చేరవేయడానికి ఈ స్టార్‌షిప్ రాకెట్ అత్యంత కీలకం కానుంది. అయితే, అంతరిక్షంలోనే రాకెట్లలో ఇంధనం నింపుకోవడం, పూర్తిగా పునర్వినియోగం చేయడం వంటి సవాళ్లు ఇంకా ముందే ఉన్నాయి. ఏదేమైనా, మానవజాతి అంతరిక్ష యాత్రల చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications
