బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ లో ఉండాలా..? ఈ హెల్దీ రెసిపీ మీ కోసమే..!
ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారింది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి, హార్మోన్ లో సమతుల్యత లోపం, స్ట్రీడ్ ఫుడ్ అధికంగా తినడం ఇలా అనేక కారణాలతో అటు ఊబకాయంతో పాటు చిన్న వయసులోనే చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే సరైన డైట్ తో పాటు నిరంతరం వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ఆరోగ్యం కోసం చాలా మంది ఫుడ్ అలవాట్లను మార్చుకున్నారు. టిఫిన్స్ లో ఇప్పుడు కొర్రల కిచిడీని తయారు చేసుకుంటున్నారు. అయితే చాలామందికి కొర్రల కిచిడీ తయారు చేసుకోవడం తెలియదు. మరి సూపర్ టేస్టీ కొర్రల కిచిడీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
కొర్రల కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే కొర్రలు ఒక కప్పు, పెసరపప్పు అర కప్పు, క్యారెట్ ముక్కలు అర కప్పు, బఠాణీలు పావు కప్పు, ఉల్లిపాయలు ఒకటి తరిగినది, పచ్చిమిర్చి రెండు లేదా మూడు చీల్చినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, నెయ్యి లేదా నూనె మూడు టేబుల్ స్పూన్ లు, తాళింపు దినుసులు(ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి), ఉప్పు తగినంత, నీరు మూడు కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా కొర్రలు, పెసరపప్పును కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత కుక్కర్ లో నెయ్యి వేసి అందులో తాళింపు దినుసులు, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే కూరగాయ ముక్కలు అయిన క్యారెట్, బఠాణీ వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన కొర్రలు, పప్పు అలాగే సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులోనే 3 కప్పుల నీరు పోయాలి. ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంపై కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ కొర్రల కిచిడీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications