health tips: వేపాకు చేదుతో జీవితంలో తియ్యదనం.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే!!
వేపాకులను నిత్యం మనం ఉపయోగించటం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ, కేశ సౌందర్యం కూడా పెరుగుతుంది. రుచికి చేదుగా ఉన్నప్పటికీ వేపాకు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేపాకులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధుమేహం అదుపులో ఉంటుంది. వేపాకులు కడుపులోని అల్సర్లను, గ్యాస్ ను, కంటి రుగ్మతలను, గుండె మరియు రక్తనాళాల సమస్యలను ఇట్టే తొలగిస్తాయి.

వేపతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
అనేక చర్మ వ్యాధులకు, రక్త దోషాలకు, ప్రేగుల సమస్యలకు వేప ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. మొటిమలు తగ్గడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, పొడి చర్మం నుంచి రక్షణ కల్పించడానికి వేప ఉపయోగపడినంత మరేది ఉపయోగపడదు. వేప గింజల రసాన్ని తేనెతో కలిపి తాగితే కామెర్ల వ్యాధి నుండి రక్షణ లభిస్తుంది. కాలేయం పనితీరును వేప మెరుగుపరుస్తుంది. వేపాకులను మెత్తగా నూరి ముఖం పైన ఉన్న మొటిమలు, మచ్చలపై రాస్తూ ఉంటే అవి మటుమాయమై చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.

వేపాకులు, వేపపుల్లలు, వేప నూనే .. ప్రతీదీ గొప్ప ఔషధమే
వేపాకు కషాయాన్ని సేవించటం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులు నయం అవుతాయి. కడుపునొప్పిగా ఉన్నవారు వేపాకును నమలి రసాన్ని మింగితే కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు వేపాకు, పసుపు తోటి కట్టుకడితే ఉపశమనం దొరుకుతుంది. వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే దంతాలు చిగుళ్ల సమస్యలు పరిష్కారమవుతాయి. పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అరికాళ్ళు. అరిచేతులు మృదుత్వాన్ని కోల్పోయినా, అరికాళ్ళు పగిలినా వేప గింజల పొడిని ఆముదంలో కలిపి బాగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మ సౌందర్యం, చుండ్రు సమస్యకు వేప ఎలా ఉపయోగపడుతుంది అంటే
కొబ్బరి నూనెలో వేపాకులను వేసి కాచి చల్లార్చి ఆ నూనెను తలకు రాసుకుంటే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప నూనె లో ముంచిన వత్తిని వెలిగించి వచ్చిన మసితో తయారు చేసిన కాటుక కళ్ళకు పెట్టుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక చుక్క వేప నూనె కంటి చుట్టూ రాస్తే కళ్ళు, కనురెప్పలు ఆరోగ్యంగా తాజాగా ఉంటాయి. వేప నూనె రాస్తూ ఉంటే కనురెప్పల కింద ఉండే నల్లటి చారలు, వలయాలు మాయమవుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాకుండా వేప, మన శరీరంలో ఉండే చెడు టాక్సిన్స్ ను బయటకు పంపించడం లోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.

వేప చేదును రోజూ జీవితంలో భాగం చేసుకుంటే మంచి స్వీట్ రిజల్ట్
ప్రతిరోజూ లేత వేపాకులు నమిలితే కడుపు ఉబ్బరం అనే సమస్య ఉండనే ఉండదు. అంతేకాదు వేపాకులు తింటే వికారం, వాంతులు తగ్గుతాయి. ఇక 1 స్పూన్ వేపాకుల ముద్ద చిటికెడు ఉప్పు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఏడు రోజులపాటు తీసుకుంటే నులిపురుగుల సమస్య తగ్గుతుంది. వేప చిగుళ్లను రోజు తినే అలవాటుగా మార్చుకున్న వారు దగ్గు మరియు అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వేప నూనెను కీళ్లు జాయింట్ల వద్ద మర్దనా చేస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. చర్మ సంబంధమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎన్నో ప్రయోజనాలున్న వేపను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications