రాయలసీమ స్పెషల్ శనగకాయ పచ్చడి ఇలా చేస్తే బెస్ట్..!
తెలుగువారి వంటింట్లో శనగకాయ పచ్చడి (వేరుశనగ పల్లీల పచ్చడి) కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది కేవలం టిఫిన్లలోకే కాకుండా, వేడివేడి అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. కాగా మాంసాహారంతో సమానమైన ప్రోటీన్ పల్లీల్లో ఉంటుంది. అలానే ఇందులో గుండెకు మేలు చేసే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తక్కువ పరిమాణంలో తిన్నా ఎక్కువ శక్తిని ఇస్తుంది.
నిల్వ & ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో 1-2 రోజులు నిల్వ చేసుకోవచ్చు. వేరుశెనగల్లో ప్రోటీన్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీ ఇవ్వడంలో ఇది చాలా మంచిది. పల్లీలు కాలిపోకుండా మధ్యమంటపై వేయించడం చాలా ముఖ్యం. అలానే ఎక్కువ పులుపు ఇష్టంలేనివారు చింతపండు పరిమాణం తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి ఇష్టంలేనివారు తీసేయొచ్చు, కానీ రాయలసీమ ఫ్లేవర్ కోసం ఇది బెస్ట్. ఈ పచ్చడిని 10 నిమిషాల్లోనే సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు..
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 1 కప్పు
పచ్చిమిర్చి - 5-6 (కారం తగినట్లు)
చింతపండు - చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి రెబ్బలు - 4-5
జీలకర్ర - ½ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 2 స్పూన్లు
పోపు కోసం:
ఆవాలు - ½ స్పూన్
మినపప్పు - 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఎండుమిర్చి - 1 (ఐచ్చికం)
తయారీ విధానం..
ముందుగా బాణలిలో వేరుశెనగ గుళ్లను మోస్తరు మంటపై దోరగా వేయించాలి. పల్లీలు బాగా చల్లారిన తర్వాత తొక్కలు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చులను స్వల్పంగా వేయించాలి. ఇలా చేస్తే పచ్చడి వాసన, రుచి బాగా వస్తాయి.
చల్లారిన పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అన్నింటిని మిక్సీ జార్‌లో వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. మీకు నచ్చినట్లుగా కొంచెం రఫ్‌గా లేదా మెత్తగా చేసుకోవచ్చు.
చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును పచ్చడిలో కలిపితే రుచి మరింత పెరుగుతుంది.
సర్వింగ్ సూచనలు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపితే రాయలసీమ స్టైల్ ట్రీట్
ఇడ్లీ, దోశ, ఉత్తపంతో చక్కగా సరిపోతుంది
రాగి సంగటి, జొన్న రొట్టెలతో అయితే ఇంకా రుచిగా ఉంటుంది












Click it and Unblock the Notifications