వర్షాకాలంలో విద్యుత్ తో బీ కేర్ ఫుల్.. ఈ తప్పులు చేయొద్దు..!
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ప్రజలు వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే విద్యుత్ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. వానాకాలంలో చెట్లు విరిగిపోవడం, విద్యుత్తు లైన్లు తెగిపోవడం, ఎక్కడిక్కడ నీరు పేరుకుపోవడం లాంటివి చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెకింగ్ చేయించుకోవాలని, ఇలా చేయడం వల్ల విద్యుత్ షాక్ ల నుంచి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోని పాత వైర్లు, స్విచ్ బోర్డులు, ప్లగ్ లకు తేమ తగిలితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని అందువల్ల వాటిని మార్పించుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు, ఎలక్ట్రికల్ వస్తువులను తడి చేతులతో తాగొద్దంటున్నారు. ఇక ఫ్రిడ్జ్, కంప్యూటర్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గోడలకు దూరంగా.. నేలపై నీరు చేరని ప్రదేశంలో అమర్చుకోవాలని వివరిస్తున్నారు.

అలాగే ఉతికిన బట్టలను ఇనుప తీగలపై ఆరవేయకూడదు. వాటర్ హీటర్ వాడేటప్పుడు స్విచ్ బంద్ చేసి, ప్లగ్ తీసిన తర్వాతే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ఎర్త్ తప్పనిసరిగా ఉండాలని.. కరెంట్ లైను కింద ఫోన్ లో మాట్లాడరాదని చెబుతున్నారు. తడిసిన కరెంటు స్తంభాలను, విద్యుత్తు లైన్లకు తగిలే చెట్లను ముట్టుకోకూడదని చెబుతున్నారు. పిల్లలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు తెగిపోయిన విద్యుత్తు తీగలను తాకరాదని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications