సూపర్ టేస్టీ రసం రైస్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే రెడీ..
చాలామందికి రసం అనగానే నోరూరుతుంది. మిగతా కూరలతో పోల్చితే రసం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే జీర్ణం కూడా ఈజీగానే అవుతుంది. అందువల్ల చాలా మంది రసం రైస్ ను చేసుకోవడానికి ఇష్టపడతారు. రసం రైస్ చేసుకుంటే చాలు.. అందులోకి కర్రీ అవసరం లేకుండానే లాగించేయొచ్చు. ఈ రసం రైస్ ను ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెళ్లిలలో స్పెషల్ గా చేస్తుంటారు. మరి ఈ టేస్టీ రసం రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
సూపర్ టేస్టీ రసం రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఒక కప్పు బియ్యం, టమాటో ఒకటి, చింతపండు రసం 50 గ్రాములు, పెసర పప్పు, కంది పప్పు చెరో 2 స్పూన్ లు, రుచికి సరిపడా ఉప్పు, నెయ్యి 2 స్పూన్ లు, ఇంగువా చిటికెడు, ఆవాలు ఒక స్పూన్, రెండు ఎండు మిర్చి, రెండు పచ్చిమిర్చి, జీలకర్ర టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి.

రసం రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యం కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు, కంది పప్పును కూడా గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, కంది పప్పు, పసుపు, టమాటా ముక్కలు, నీళ్లు పోయాలి. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మరో గిన్నెలో చింతపండు పులుసు, రసం పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికిన అన్నంలో ఈ మిశ్రమం.. కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడ స్టౌ మీద మరో గిన్నె పెట్టుకుని తాలింపు చేసుకోవాలి. తాలింపు కోసం నెయ్యి వేసి అందులో ఇంగువా, ఆవాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండు మిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపును ఎర్రగా వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని అన్నంపై పోయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేస్తే సరి సూపర్ టేస్టీ రసం రైస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications