చేప లేకుండానే 'చేపల పులుసు'.. ఇలా ఈజీగా చేసుకోండి..!
చేపల పులుసు అంటేనే చాలామందికి నోరూరుతుంది. ఇక చేపల పులుసు తింటే ఆ అనుభూతి మరువలేనిది. చేపల పులుసును ప్రాంతాన్ని బట్టి టేస్టూ మారుతుంటుంది. అలాగే చేపను బట్టి కూడా టేస్టు మారుతుంది. పులస చేప లాంటి అరుదైన చేపలు అయితే ఆ పులుసు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే చేప లేకుండానే చేపల పులుసు తయారు చేయడం మీకు తెలుసా..? చేప లేకుండానే ఈ టేస్టీ చేపల పులుసు ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
చేప లేకుండానే 'వెజ్ చేపల పులుసు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అరటికాయలు రెండు లేదా మూడు, చింతపండు నిమ్మకాయ సైజు, ఉల్లిపాయలు నాలుగు లేదా ఐదు మీడియం సైజు, టమాటాలు రెండు లేదా మూడు ప్యూరీ కోసం, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, మెంతులు అర టీ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తగినన్ని, కరివేపాకు కొన్ని, కొత్తిమీర తురుము కొద్దిగా, నూనె తగినంత, కారం రుచికి సరిపడా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత తీసుకోవాలి.
'వెజ్ చేపల పులుసు' తయారీ విధానం చూస్తే.. ముందుగా అరటికాయలను తొక్క తీసేసి చేప ముక్కల మాదిరి కట్ చేసుకుని మధ్యలో రంధ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఓ ప్లేట్ తీసుకుని అందులో కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, నూనె తగినంత వేసి మసాలా ముద్దగా చేసుకోవాలి. ఈ మసాలాను అరటికాయ ముక్కలను పట్టించాలి. అలా వాటిని దాదాపు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెనంపై వాటిని లైట్ గా రోస్ట్ చేయాలి.

ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతుల మిశ్రమాన్ని వేయించుకుని పొడి చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. అలా ముద్దను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముద్దను పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. అందులోనే టమాటో ప్యూరీని కలుపుకోవాలి. నూనె పైకి తేలే సమయంలో ఆ మిశ్రమంలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మగ్గించుకోవాలి.
ఆ మిశ్రమంలోనే చింతపండు రసం, నీళ్లు పోసి మరిగించుకోవాలి. కొద్దిసేపటికి అందులోనే అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మరోసారి మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లుకుని దింపుకుంటే సరి.. సూపర్ టేస్టీ వెజ్ ఫిష్ పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications