పుచ్చకాయ చెక్కు పచ్చడి.. ఎప్పుడూ ట్రై చెయ్యకుంటే ఇప్పుడు చెయ్యండి!
పండ్లు, కూరగాయల తొక్కలను చాలామంది పారేస్తుంటారు. కానీ వాటిలో కూడా చాలా పోషకాలు దాగి ఉంటాయి. అలాంటిదే పుచ్చకాయ చెక్కు. పుచ్చకాయ తినేటప్పుడు ఎర్రని భాగం మాత్రమే తీసుకుని, తెల్లని భాగాన్ని వదిలేస్తాం. కానీ ఆ తెల్లని చెక్కుతో చట్నీ చేస్తే రుచి చాలా బాగుంటుంది. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
పుచ్చకాయ చెక్కులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. వ్యర్థం లేకుండా వంట చేసుకునే అలవాటు కూడా పెరుగుతుంది. ఇలాంటి చట్నీలు మన అమ్మమ్మల కాలం నుంచే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి.

కావాల్సిన పదార్థాలు:
పుచ్చకాయ తెల్లని చెక్కు - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 5
చింతపండు - నిమ్మకాయంత
పల్లీలు - పావు కప్పు
పసుపు - పావు స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం: ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర - అర స్పూన్ చొప్పున
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 2 రెబ్బలు
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - గుప్పెడు
తయారీ విధానం:
ముందుగా పుచ్చకాయ ఆకుపచ్చని తొక్కను తీసేయాలి. లోపలి తెల్లని భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పల్లీలను నూనె లేకుండా వేయించి సైడ్‌కి పెట్టుకోవాలి.
ఇప్పుడు కడాయిలో సగం నూనె వేసి వేడి చేసి, పుచ్చకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా ముక్కలు వేసి వేయించాలి. పసుపు, చింతపండు కలిపి ఒక నిమిషం ఉడికించి సెగ తగ్గించాలి. చల్లారిన తర్వాత వేయించిన పల్లీలు, వెల్లుల్లి, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
తర్వాత చిన్న ప్యాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు చెయ్యాలి. ఈ తాలింపును చట్నీలో కలిపి కొత్తిమీర చల్లితే రుచికరమైన పుచ్చకాయ చెక్కు చట్నీ తయారవుతుంది. ఈ చట్నీ అన్నంతోనే కాదు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి వంటి అన్ని తినుబండారాలతో కూడా బాగా సరిపోతుంది. కాస్త ఘాటుగా కావాలంటే పచ్చిమిర్చి సంఖ్య పెంచుకోవచ్చు. వేసవిలో పుచ్చకాయ ఎక్కువగా దొరికే సమయంలో ఈ చట్నీ తయారు చేసుకుంటే బాగుంటుంది.













Click it and Unblock the Notifications
