ధనుర్మాసం విశిష్టత: లోగిళ్లలో ముగ్గుల తోరణాలు
16-డిసెంబర్-2017 నుండి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షతము నందు ఉండుట వలన,సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు.
ఈ నెలరోజులపాటు బాలికలు,మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు.
చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు.ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరి దాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు.సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు.గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు.

పురాణములలోను,ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును.అందుచేతనే పులగమును గాని దధ్యోదనమును గాని దేవునుకి నివేదించి తినవలయునని నియమమును తెలియజేసారు.ఈ నెల శ్రీ మహా విష్ణువుకు ప్రీతి కరమైనది. వైష్ణవ దేవాలయములో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు.
బ్రాహ్మీ ముహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి "కటు పొంగలి" దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు. స్వామి వారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడతారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసము వరకుచలి చాల ఉదృతంగా ఉంటుంది.చలికాలంలో మన శరీరంలో రక్తలో మార్పిడి జరుగుతుంది.అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది.
విష్ణు చిత్తుడను భ్రాహ్మణుని ఏకైక పుత్రిక గోదాదీవి మంచి సౌందర్యరాశి.ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ.ఆమాలలను పదిలంగా తండ్రి కిచ్చేది. ఈ విషయము తేలియని ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు.
ఇదే విధంగా ప్రతి రోజూ జరుగసాగింది.అయితే గోదాదేవి స్వామి వారిపై రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్తగా ఊహించుకొనేది.చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది.ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్రక్కనే రంగనాధ స్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా.ఒక రోజు పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలో దాగిఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నది గమనించారు.
అది స్త్రీ వెంట్రుకని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తుని నానా దుర్భాషలాడారు. అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా, అక్కడ మాలలను అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న తన కూతురుని చూసి అమితమైన ఆగ్రహముతో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది.తండి తన కూతురు మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగా ఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్రమూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ఇష్టమని తెలియజేసి ఆందరి సమక్షములో శ్రీ రంగనాథస్వామి గోదాదేవిని వివాహమాడాడు.
మానవ స్త్రీ సాక్షత్తు దేవున్ని తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడేవరకు వదలలేదు. నిష్ట కలిగిన భక్తికి భవవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాళ్ గా పిలువ బడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు"ఆముక్త మాల్యద"అను పేరున"విష్ణు చిత్తియం అనిగూడ అందురు"గ్రంధ రచన గావించెను .ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని అర్థము.
ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వచ్చును.ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకరణతో దర్శించి తరించెదరు.
ఈ నెలరోజులులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి,ఉదయం ,సాయంత్ర సమయాలలో స్త్రీలు,ముత్తైదువలు తులసికోటను అందంగా అలంకరించుకును దీపారాదన చేసి చుట్టు ప్రదక్షిణలు చేయుట వలన మనోవాంచలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు,ఇది ప్రకృతి ఆరాధన
మహోత్సవం జైశ్రీమన్నారాయణ.
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.












Click it and Unblock the Notifications