నేటి నుంచే డేంజరస్ 9 హాట్ డేస్ ప్రారంభం
ఈ ఏడాది నౌతపా ప్రభావం మే 25 నుండి జూన్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగనుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాది రాష్ట్రాలవారు నౌతపాగా జరుపుకొంటారు. మనకు ఇది రోహిణి కార్తె. రోహిణి కార్తె నేటి నుంచి మొదలైంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యుడి వేడి విపరీతంగా పెరిగుగుతంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రంలో నౌతపాకు విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు నౌతపా ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు. జ్యోతిష్య గణనల ప్రకారం, ఈ ఖగోళ సంఘటన జూన్ 2 వరకు ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు సూర్య కిరణాలు భూమిని నేరుగా తాకి, వేడి తీవ్రతను పెంచుతాయి.

ఈ తొమ్మిది రోజుల పాటు సూర్యదేవుడు వృషభ రాశిలో ఉంటాడు, రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోహిణి.. చంద్రుడికి అత్యున్నత నక్షత్రం. సూర్య చంద్రులను మనం దైవ సమానులుగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. నౌతపా కాలంలో ఎంత ఎక్కువ వేడి ఉంటే, అంత మంచి రుతుపవనాలు వస్తాయని ఒక బలమైన నమ్మకం ఉంది.
అందుకే ఈ తొమ్మిది రోజులను శుభప్రదంగా భావించి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన సమయంగా చూస్తారు. ఈ తొమ్మిది రోజుల నౌతపా ప్రభావం వల్ల వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. సూర్యుని ప్రచండత పెరుగుతుంది. దీంతో పాటు బలమైన వేడి గాలులు వీస్తాయి.
నౌతపాను సూర్య ఆరాధనకు విశిష్టమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ తొమ్మిది రోజులు సూర్యదేవుడిని పూజించడం వల్ల జాతకంలో సూర్యుని ఉచ్ఛస్థితి బలపడుతుందని, ఫలితంగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో 'ఓం సూర్యాయ నమః', 'ఓం ఘృణి సూర్యాయ నమః' వంటి మంత్రాలను జపించాలి. ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం, సూర్య చాలీసా వంటివి పఠించడం శుభప్రదం. యోగా సాధకులు సూర్య నమస్కారాలు చేయాలి.
నౌతపా రోజులలో భక్తులు ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాతే ఈ పూజకు సిద్ధపడాలి. రాగి పాత్రలో స్వచ్ఛమైన నీరు, ఎర్ర చందనం, కుంకుమ, ఎర్ర పూలు వేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి. 'ఓం ఘృణి సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ భక్తిశ్రద్ధలతో అర్ఘ్యం సమర్పించాలి.
ఈ భీషణ వేసవిలో పేదలకు దానం చేయడం, నిర్భాగ్యులకు సహాయం చేయడం, జలధారలు ఏర్పాటు చేసి నీరు, శర్బత్ పంపిణీ చేయడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. బాటసారుల దాహం తీర్చేందుకు తాగునీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మట్టి కుండలు, పుచ్చకాయలు, మామిడిపండ్లు, సత్తు పిండి దానం చేయడం వల్ల జాతకంలో సూర్యచంద్రులు బలపడతారని నమ్మకం.
కుండలిలో సూర్యుడు బలహీనంగా ఉండి, ఉద్యోగంలో సమస్యలతో బాధపడుతున్న వారికి నౌతపా తొమ్మిది రోజులు నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయాలని పండిట్ వినీత్ శర్మ సూచించారు. ఇది ఆరోగ్యాన్ని పొందడానికి, రోగాలను నయం చేయడానికి అద్భుతమైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.
మానసిక శాంతి, సానుకూల శక్తి కోసం గాయత్రీ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించాలి. సూర్యదేవుని కృపతో బుద్ధి తేజస్సు పెరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు రాగి పాత్రలను ఉపయోగించడం మంచిది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.












Click it and Unblock the Notifications