వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన దేహం- శ్రీ చక్రం: ప్రభావం, ప్రాముఖ్యత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సృష్టిలోని అంతర్ ముఖంగా దాగిఉన్న శక్తిని గమనించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే పుట్టాయి. అయినా దేనికవే ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట.

మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము యొక్క పనిని కలిగి ఉంటాయి. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే ఆ దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు.

వేదమునకు మూలము నాదము.దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

యంత్రమంటే ఏమిటి ?

యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి

1) ఇచ్ఛాశక్తి

2) జ్ఞానశక్తి

3) క్రియాశక్తి.

ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.

చరాచర సృష్టి మొత్తం మూడు శక్తుల కలయికే ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే

నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.

the story about Sri Chakram

విజ్ఞాన వేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని 'పరాశక్తి' అని 'అవ్యక్తం' 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి.

త్రిమూర్తులకు దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది.

శ్రీ చక్ర ఆవిర్భావం

ఉండేది బ్రహ్మమొక్కటే ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.

కేవలం కాంతి (ప్రకాశ) రూపముగాఉన్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను,విమర్శను పరాశక్తిగాను భావించారు.

కాంతి స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవలన నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది.

సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

1 శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు

అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న బిందువు, 2) అచేతనంగా ఉన్న 'శివుడు, 3) చేతనా స్వరూపమైన శక్తి ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము.

త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం కనీసం ఊహించలేం కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు శ్రీ దేవియే శ్రీ చక్రము శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.

శ్రీ చక్ర నిర్మాణం

బిందువు త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము - బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రం.

శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర,శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదు శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు.

ఈ చక్రం లోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీ చక్రము అష్టాచక్రా అవుతుంది.

నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం.

శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.

1. భూపుర త్రయం - త్రైలోక్య మోహన చక్రం

2. షోడశ దళ పద్మం - సర్వాశా పరిపూర చక్రం

3. అష్ట దళ పద్మం - సర్వ సంక్షోభిణీ చక్రం

4. చతుర్దశారము - సర్వ సౌభాగ్య చక్రం

5. బహిర్దశారము - సర్వార్థ సాధక చక్రం

6. అంతర్దశారము - సర్వ రక్షాకర చక్రం

7. అష్ట కోణము - సర్వ రోగహర చక్రం

8. త్రి కోణము - సర్వ సిద్ధిప్రదా చక్రం

9. బిందువు - సర్వానందమయ చక్రం

ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు.

శ్రీ చక్రం - మానవ శరీరం

గమనించవలసిన విషయమేమంటే ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవుని యందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే - నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరు దండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో మన మేరు దండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.

మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.

శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు.

కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.

దేహో దేవాలయః ప్రోక్తో

జీవో దేవస్సనాతనః

త్యేజేదజ్ఞాన నిర్మాల్యం

సోహంభావేన పూజయేత్‌ !

శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.

కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి.

విశ్వంలోని శక్తులన్ని తొమ్మిది ఆవరణముల ద్వారా ఉత్పతై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.

నిరంతర సాధన మార్గం

శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత అదృష్టంగా అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు - వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం.

ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!

త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు తొలగించుకో వలసిన తెరలు అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్ని శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి, వాటిని లేకుండా చేయలేం.మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవా వరణములను నిర్లిప్తతతో, నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలి.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
The Astrologer told about the Sri Chakra effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X