• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గరుడోపాఖ్యానం గరుడు మాతృ భక్తి

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

బ్రహ్మ మానస పుత్రులలో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకి కశ్యపుడు.అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60మంది కుమార్తెలలో అథిది, తిధి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిధి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. తిధి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు వారందరిని ''దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరిని నాగజాతి వారు అన్నారు.

కద్రువ, వినత చాలాకాలం కశ్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు వేయిమంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆతరువాత వినత వీరికంటే అసాదరణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసే ''పుత్రకామేష్టి'' యాగం చాలా రోజులపాటు చేశాడు. ఆతరువాత కద్రువకి పిండం పుడితే ఆపిండాన్నినేతి కుండలో భద్రపరిచింది. వినతకి రెండు గుడ్లు పుట్టాయి.

ఐదువందల సంవత్సరాల అనంతరం కద్రువకి ''వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, తో పాటు ధనుంజయుడు, ఖాళీయుడు, మణి నాగుడు, అపురణుడు, సురాముఖుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కలశపోతకుడు, ధదిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, శంఖుడు, వాలిశికుడు, నిష్టానఖుడు, హేమసహుడు, నహుషుడు, పింగళుడు, బహ్యకర్ణుడు, హస్తిపాదుడు, ముద్గురుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు, వీరితో కలిపి వేయిమంది సర్పాలు పుట్టాయి. కాని వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధతో కద్రువకి అప్పుడే సంతానం కలిగారు. నాకు ఇంకా కలగలేదు. అని దుఃఖించింది.

 what is Garudopakhyanam ..?

ద్రువ మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో ఒక గుడ్డుని పగలగొట్టింది. అందులోనుండి ఊరువులు(తొడలు) ఇంకా తాయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు! ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామదేయం ఏర్పడింది. ((అన్+ఊరుడు= అనూరుడు)తొడలు లేని వాడు అని అర్ధం. ఈ అనూరుడు సూర్యుడికి ఉదయం పూట రథ సారధి. ఉదయాన్నే ఉదయించే నారింజపండు రంగు అనూరుడి రూపం. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తరువాతే నేను దర్శనం ఇస్తాను అని సూర్యుడు అనూరుడికి వరం ఇచ్చాడు.ఉదయం నుండి ఎనిమిది గంటలు అనూరుడు రథం తోలతాడు. తరువాత వేరెవరు వస్తారు.)

అలా పుట్టగానే తన తొడలు చూసుకొని ఎంత ఆపని చేశావ్ అమ్మా! ఇంకో 500సంవత్సరాలు ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కాదమ్మా! నీ సవతిమీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసివి ఐపో అని శపించాడు. దానికి వినత భాదపడి నాయన తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వోచ్చునా? అని కన్నీరు పెట్టుకోగానే సరే ఇంకో 500సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు. అందులోనుంచి ఓ అద్భుతమైన శక్తితో అతిబలవంతుడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. (ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు రధం నడిపే అనూరుడే ఈ అనూరుడు).

ఒకరోజు కద్రువ వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకి వెళ్లారు. అక్కడ శ్వేత వర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు ఆహా! ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, అక్కా గుర్రం అంతా తెల్లగానే ఉంది కాని తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. వినత మళ్లీ ఒకసారి పరిశీలించి లేదు చెల్లి అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదక్క తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కావాలంటే చిన్న పందెం వేద్దామా! తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి. లేదంటే నేను నీదగ్గర దాసిగా చేస్తాను ఏమంటావ్? అంటే! వినత సరే అని "ఉచ్చేయ్ శ్శ్రవం" అనే ఆ గుర్రం దగ్గరికి వెళ్తుంటే ... ఆగక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాం. అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరు కలిసి గృహానికి వెళ్ళిపోయారు.

కద్రువ తన పిల్లలైన పాములందరిని పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్! నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్ల నాగులు ఉన్నాయి. మీరు వెళ్లి ఆతోకని మీ మహిమతో కరిచిపట్టుకొని మీ మహిమతో అచ్చం వెంట్రుకలులా కనపడండి. అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసీ అవుతుంది అనగానే, పాముల్లో కొన్ని ఛీ!నువ్వు తల్లివేనా? తప్పడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులకి ద్రోహం చేస్తే ఆ పాపం ఊరిరికే పోదు. ఏదో రోజున శాపంగా పరిణమిస్తుంది. ఛీ పో! మేము ఆపని చేయలేము అన్నాయి.

కద్రువ ఆ మాటలకి కోపించి "మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి భూడిద అయిపోతారు గాక!" అని శపించింది. దాంతో ఆ పిల్ల పాములకి భయం వేసింది. వారిలో కర్కోటకుడు అనే సర్పం సరే అని వెళ్లి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకొని తన మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చేయ్ శ్శ్రవం యొక్క తోకని కరచి పట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత, కద్రువలకి తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి. ఇక ఆనాటినుండి కద్రువ దగ్గర వినత దాసీగా ఉండిపోయింది.

చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 500ఏళ్ళు గడిపేసింది. అనూరుడు చెప్పినట్టు గుడ్డు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో, బంగారు వర్ణంతో ధగధగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడుడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకి ఎగిసింది. అదిచూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్టు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి, పర్వతాలు కదిలిపోయి పెళ పెళ విరిగి కింద పడిపోయాయి. జగజ్జేగీయమానంగా వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడబడ్డాడు గరుడుడు. ఆయనే గరుత్మంతుడు. (వైనతేయుడు).

ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి ఒరేయ్ మీఅమ్మ నాకు దాసీ. కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడువే. నేను చెప్పిన పనిచెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకురమ్మని మీద ఎక్కించింది. గరుత్మంతుడు ఆ పాముల్ని తనమీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పై పైకి ఎగురు. ఇంకా ఎగురు అంటూ ఉంటే ఇంకా పైపైకి ఎగిరాడు. పైకి వెళ్తున్న కొద్ది సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములు అన్ని సొమ్మసిల్లి పోయాయి. కిందకి రాగానే కద్రువ చూసి మీ అమ్మకి నీకు నేనంటే అలుసు, నేనన్నా నాపిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అన్ని అనేసి వెళ్ళింది.. అలా మరో 500ఏళ్ళు గడిచిపోయాయి.

గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది. అంటే వినత నిస్సహాయంగా ఏమి చేయను? మీ అన్న అనూరుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగింది అంత చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్లి పిన్ని ఏమి చేస్తే మాకు దాస్యవిముక్తి కలుగుతుందో చెప్పు అనగానే కద్రువ "నేను నా పిల్లలకి క్రోదావేశంలో జనమేజయుడి యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం శాపం పెట్టాను.

ఆ శాపం నుండి విముక్తి పొందాలంటే అమృతం సేవించాలి. అమృతం సేవిస్తే జనమేజయుడు చేసే సర్పయాగంలో పడినా ఏమి కాదు. అదీగాక నీ అంత బలవంతుడు నాదగ్గర ఉంటే నాకే ఏదోనాటికి ప్రమాదం సంభవిస్తుంది. అంటూ ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు నాయన నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు?

దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది. అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్యవిముక్తి కలిగిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా దేవలోకం ఎక్కడుందో, ఎలావేళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరే అని తండ్రి అయిన కశ్యపుడు దగ్గరికి వెళ్ళాడు. తండ్రి! మాకు దాస్యవిముక్తి కావాలి అంటే అమృతం తీసుకుని రమ్మని పెద్దమ్మ తెలిపింది.

స్వర్గలోకానికి వెళ్లాలంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నీరసించిపొయను. అంతదూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి మార్గం చెప్పండి అనగానే.. గరుడా! ఇక్కడికి దగ్గరలో మ్లేచ్చ గ్రామము ఒకటున్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఏ జీవిని వదలరు. వాళ్ళు పదివేల మంది ఉంటారు. వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషం రాదు. జనులకు మేలు చేసినవాడివి అవుతావు.

నాయనా! మరొక్కమాట అక్కడికి ఈమధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమిచేయకు అన్నాడు. తండ్రీ అంత మందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అనగానే నీగొంతుక్కి ఎవరు అడ్డంపడి వేదిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. అతడిని మాత్రం ఎట్టిపరిస్థితులలో ఏమి చేయకు. అనగా! సరే అని గరుత్మంతుడు మ్లేచ్యగ్రామం వెళ్లి ఒక్కసారిగా పదివేల మందిని ఒక్క సారిగా గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలైంది. అది గమనించిన గరుడుడు "ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్టు ఉన్నారు బయటికి రావచ్చు" అన్నాడు. నాయన ఈమధ్య ఒక బోయ స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను.

ఆవిడలేకుండా నేను బయటికి రాను. అనగానే బ్రాహ్మణోత్తమా నువ్వు వివాహం చెసుకున్నతరువాత ఆమె కూడా ఉత్తమురాలే. కాబట్టి ఆమెని కూడా తీసుకుని బయటికిరా అనగానే సరే అని ఇద్దరు కలిసి బయటకి వచ్చేశారు. గరుత్మంతుడు ఈ పదివేల మందిని ఆహారంగా తీసుకున్నా సరిపోక తండ్రి దగ్గరికి వెళ్లి ఆహారం సరిపోలేదు. బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే కశ్యపుడు ఒక్క క్షణం అలోచించాడు.

నాయనా గరుడా! పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపో అంటే, ఇంకొకడు కశ్చపం అయిపో అని శపించుకున్నారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో కశ్చపం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యం కొట్టుకుంటూ, కొట్లాడుకుంటూ ఉంటారు. వీటిని తిను. మరొక విషయం నాయనా! ఒకటి ఉన్నపుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలు అయిన చనిపోతారు. కాబట్టి రెండు ఉన్నపుడు ఒక్కసారిగా పట్టుకుని తిను.

వారిని చంపడం వల్ల వారికీ శాపవిమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరుతుంది. అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్లి ఆ సరస్సు దగ్గర వున్న చెట్టుమీద నిలబడి రెండు ఎప్పుడు కలుస్తాయా! అని ఎదురుచూస్తున్నాడు. ఇంతలో గజం నీరు తాగడానికి వచ్చి ఆసరస్సులోకి దిగగానే కశ్చపం గజాన్ని గట్టిగా పట్టుకుంది. రెండు నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకటి మునగడం, ఒకటి తేలడం జరుగుతుంది. చాలాసేపటి వరకూ అలా కొట్లాడుకుని రెండు ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు గజకశ్చపాలను రెంటిని రెండు కాళ్ళతో కరిచి పట్టుకుని రివ్వున ఆకాశానికి ఎగిరాడు.

వీటిని ఎక్కడ పెట్టుకుతినాలి అని వెదుకుతూ ఉండగా 80మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఊడలు, శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మఱ్ఱిచెట్టు ఒకటి కనపడింది. చెట్టు గరుడుడిని చూసి నాకొమ్మలు చాలా బలంగా ఉన్నాయి సందేహించకు వాటిని నాకొమ్మల మీద పెట్టుకొని తిను. అనగానే గరుడుడు వెంటనే చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మమీద కూర్చున్నాడు. గరుడుడు బరువుకి పెళపెళ ధ్వనులతో కొమ్మ విరిగిపోయింది. ఆకొమ్మకి వాలఖిల్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుడుడు ఈ కొమ్మ కిందపడితే వాళ్ళు చనిపోతారేమోనని, లేక కిందపడి తలలు పగిలితే తనని శపిస్తారేమో అని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు.

రెండుకాళ్ళలో గజ కశ్చపాలు, నోటితో ఈ చెట్టు కొమ్మ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. గరుడుడు పరిస్థితి చుసిన కశ్యపుడు ఆ వాలఖిల్యులకి నమస్కరించి ఈ గరుత్మంతుడు నా కుమారుడు. కారణజన్ముడు. వాడిని మన్నించి కిందకి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుడిని ఆశీర్వదించి క్రిందికి వచ్చారు. అప్పుడు కశ్యపుడు గరుడుడితో ఈ కొమ్మని నువ్వు ఇంతకుముందు తిన్న మ్లేచ్య గ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పారవేయి.

ఇంకెక్కడ పడేసిన ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. గరుడుడు ఆకొమ్మని మ్లేచ్యగ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండమీద ఈ గజ కశ్చపాలని పెట్టుకొని తిన్నాడు! దాంతో వాళ్ళకి శాపవిమోచనం జరిగి గరుడుడిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్లి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తపశ్శక్తి కలిగిన ఇద్దరు అన్నదమ్ములని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది. స్వర్గం ఎక్కడుందో తెలుపమన్నాడు.

నాయన! ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్ని గుండం ఏర్పాటుచేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి రెండుపక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలా ఉంటాయి. నువ్వొక పనిచెయ్. నువ్వు అక్కడికి వెళ్తే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేస్తాడు కనుక నువ్వు నెయ్యి తీసుకెళ్ళి అందులో ఒకేసారి వెయ్. అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృతభాండాన్ని తీసుకోవచ్చు అని చెప్పగానే సరేనని నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్లి అంతా చూచి కామదేనువు దగ్గరికి వెళ్లి వెన్న యాచించి తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని మీదకి వచ్చాయి. గరుడుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పలమీద కొట్టగానే తలలు పగిలి క్రింద పడిపోయాయి. అనంతరం గరుడుడు అమృతభండాగారం తీసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాడు.

గరుత్మంతుడు వెళ్లిపోతుంటే అక్కడున్న భటులు గరుడుడిని చూసి ఇంద్రుడుతో గరుత్మంతుడు అమృతం దొంగిలించి తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పారు. వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుడిని వెంబడించి ఆగవోయి గరుడా! అని హుంకరించాడు. అయినా గరుడుడు వినకుండా వెళ్లిపోతుంటే గరుత్మంతుడి మీదికి వజ్రాయుధం ప్రయోగించాడు. నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధం గరుత్మంతుడి వద్దకి వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి "నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు." నువ్వు నన్ను ఏమిచేయలేవు. కానీ మహర్షి వెన్నుపామువి కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక ఈక తీసుకుని వెళ్ళు అని వజ్రాయుధానికి ఒక ఈక పీకి ఇచ్చాడు.

వజ్రాయుధం ఆఈక తీసుకొని ఇంద్రుడు దగ్గరికి వెళ్ళి ఈ ఈకతప్ప ఏమి పీకలేకపోయాను. అది కూడా ఆయనిచ్చిందే అనిచెప్పింది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడు బలం అర్ధమై ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు ఐతే మంచిది అని మిత్రమా! గరుడా ఈరోజునుంచి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్కమాట! నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి పాములకి పోశావనుకో వాటికి చావు ఉండదు. విషం పెరుగుతుంది. వాటికి చావులేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని, ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసినవాడివి అవుతావు.

నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీరు బంధవిముక్తులు అవ్వండి. ఆతరువాత శుచి లేకుండా ఈ అమృతాన్ని ముట్టుకోకూడదు స్నానం చేసి రమ్మని చెప్పు. వీళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళతారు. నేను ఈకలశం తీసుకోచ్చేస్తాను అప్పుడు నీమాట నెరవేరుతుంది, నా పని అవుతుంది. వాళ్ళ తిక్క కుదురుతుంది. అనగానే గరుత్మంతుడు సరేనన్నాడు.

అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నీ మాతృ భక్తికి మెచ్చుకున్నాను. ఏవరం కావాలో కోరుకోమన్నాడు. ఈరోజునుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. సరే ఐతే! ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. నీకు వాహనం అయ్యే వరం ప్రసాదించు అన్నాడు. సరే నువ్వు మీతల్లిని బంధవిముక్తిరాలిని చేసి నాదగ్గరికి వచ్చేయి. ఈ రోజునుండి గరుడ వాహనుడినై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అన్నాడు. (మాతృభక్తి వల్ల సాక్షాత్తు విష్ణువుకి వాహనం అయ్యాడు.)

గరుత్మంతుడు విష్ణువుకి నమస్కరించి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి అమ్మా! కద్రువా ఇదిగో అమృతం! ఇక నాకు నాతల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధవిముక్తి. అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ అమృతాన్ని దర్బలమీద పెట్టి ఈ అమృతాన్ని అశుచిగా త్రాగరాదు, అంటరాదు కనుక మీరు వెంటనే సముద్రస్నానం చేసి వచ్చి స్వీకరించండి అన్నాడు. కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశం దగ్గరికి వచ్చి అమృతకలశం తీసుకొని మాయమైపోయాడు.

తిరిగివచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్నచోట దర్భలు తప్ప ఏమి కనబడలేదు. ఇల్లంతా కలయజూచినా కనబడకపోయే సరికి అందరూ ఘొల్లున గోలపెట్టారు. అయ్యో! దాసీగా ఉన్న వినత, బలవంతుడు అయిన గరుడుడు బంధ విముక్తి పొంది వెళ్లిపోయాడు, అమృతకలశం పోయింది అని భోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు అత్రగాళ్ళు అమృతం ఉన్న కలశం ఈదర్భల మీద పెట్టారు కాబట్టి కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండొచ్చు అనుకోని ధర్భలని నాకారు. నాకడంతో అప్పటివరకు ఒక్క నాలుకే ఉన్న పాములు ద్విజిహ్వలుగా(రెండు నాలుకలు)మారిపోయాయి.ఆనాటి నుండి వాటికి మాటకూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the sons of Brahma Mansa is named Marichi. He has a son. This Kashyap is married to 13 of the 60 daughters of Dakshina Prajapati, including Athidhi, Tidhi, Vinitha, Kadruva, Vinata etc. The gods were born because of this guest. That is why they are called Adityas. All the sons and daughters of Tithi are born as 'Dhyatis'. Some snakes have been born with Surasa. That is why they are all Nagasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more