దేశ రాజకీయాన్నిషేక్ చేసిన 2026, నభూతో నభవిష్యతి..
భారత రాజకీయ చరిత్రలో 2026 ఒక సరికొత్త రికార్డును లిఖించింది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే దేశంలోని ఐదు కీలక రాష్ట్రాలు సరికొత్త ముఖ్యమంత్రులను చూశాయి. ఊహించని ఎన్నికల ఫలితాలు, సంకీర్ణ ఒత్తుళ్లు, వారసత్వ ప్రణాళికలు, పార్టీల అంతర్గత పవర్ షేరింగ్ ఒప్పందాల వల్ల ఈ ఐదు రాష్ట్రాల నాయకత్వ పగ్గాలు చేతులు మారాయి. 2029 లోక్‌సభ సమరంలో ఎలాగైనా గెలుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదునుపెడుతూ.. ఐదో నెల ఈ ఐదుగురు నేతలకు పట్టాభిషేకం చేశాయి. ఆ ఐదు రాష్ట్రాల పొలిటికల్ పిక్చర్ ఇలా ఉంది:
1. కర్ణాటక: సిద్ధరామయ్య ఔట్.. డీకే శివకుమార్‌కు పట్టాభిషేకం!
దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ఒక కీలకమైన నాయకత్వ మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య జరిగిన 'రోటేషనల్ సీఎం' (సగం పదవీకాలం) ఒప్పందం ప్రకారం.. ఇప్పుడు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. పార్టీ అంతర్గత వర్గ సమతుల్యతను కాపాడుతూ, పవర్ షేరింగ్ సూత్రానికి కట్టుబడి హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

2. పశ్చిమ బెంగాల్: 15 ఏళ్ల దీదీ పాలనకు ఎండ్ కార్డ్.. సువేందు అధికారి సర్కార్!
తూర్పు భారతదేశ రాజకీయాల్లో ఒక పెను భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించుతూ.. భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఆ తర్వాత బీజేపీ బెంగాల్ ప్రచారానికి సారథిగా మారిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీఎంసీ అవినీతి, రాజకీయ హింస, నియామక కుంభకోణాలను ఎండగట్టడం , హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా బీజేపీ ఇక్కడ కమలం వికసింపజేసింది.
3. తమిళనాడు: ద్రావిడ కోటలో 'విజిల్' వేసిన దళపతి!
తమిళనాడు రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా సరికొత్త మలుపు తిరిగాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యంలో ఉన్న ద్రావిడ కోటను బద్దలు కొడుతూ.. నటుడు, రాజకీయ నాయకుడు సి. జోసెఫ్ విజయ్ (Thalapathy Vijay) ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) మిత్రపక్షాలతో కలిసి ఆయన అధికారం చేపట్టారు. అవినీతి వ్యతిరేక సందేశం, సంక్షేమ హామీలు, యువత , తమిళ గుర్తింపును మేళవించి విజయ్ చేసిన ప్రచారం యువ ఓటర్లను భారీగా ఆకట్టుకుంది.
4. కేరళ: లెఫ్ట్ కోట కూలింది.. వీడీ సతీషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ హవా!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఎల్‌డీఎఫ్ (LDF) వరుస పాలనకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నిలకడగా పోరాడిన వీడీ సతీషన్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అంతర్గత సంప్రదింపులను విజయవంతంగా ముగించి, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ అవినీతిపై దూకుడుగా విమర్శలు చేస్తూ, పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుండి పునర్నిర్మించడంలో సతీషన్ పోషించిన పాత్రే ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.
5. బీహార్: నితీశ్ శకానికి ముగింపు.. సామ్రాట్ చౌదరి సరికొత్త ప్రస్థానం!
దాదాపు రెండు దశాబ్దాలుగా మారుతున్న పొత్తులు, సంకీర్ణ సమీకరణాలతో బీహార్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన 'నీతీశ్ కుమార్' యుగానికి తెరపడింది. జేడీయూ (JD-U)కి జూనియర్ భాగస్వామిగా ఉండే స్థాయి నుండి.. తానే సొంతంగా లీడ్ తీసుకునే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ అక్కడ తొలిసారి తన సొంత ముఖ్యమంత్రిని కూర్చోబెట్టింది. బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడర్ సామ్రాట్ చౌదరి బీహార్ నయా ముఖ్యమంత్రి అయ్యారు. నాన్-యాదవ్ ఓబీసీలు, ఈబీసీలు , దళిత సామాజిక వర్గాలను ఏకీకృతం చేయడం ద్వారా చౌదరి ఈ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇది బీహార్‌లో బీజేపీ సుస్థిర నాయకత్వ నమూనాకు నాందిగా విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications