వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్గశిర శుద్ధ అష్టమి విశిష్టత ఏమిటి? ఆసక్తికరంగా కాలభైరవాష్టమి పుట్టుక

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.

ఋగ్వేదం:- అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్ట మొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమ శివుడు పర బ్రహ్మము అంది.

What is Kala Bhairava Ashtami?

యజుర్వేదము:- తరువాత యజుర్వేదమును పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞము నందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.

సామవేదము:- తరువాత సామ వేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది.

అధర్వణవేదము:- పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది.

అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.

ప్రణవం:- ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది.

ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను తీసివేయి అన్నాడు.అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది . ఆ రూపమే కాలభైరవ స్వరూపం.

ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు.

కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు.బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.

కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవా నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా యిచ్చాడు.

విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని ''కపాల మోక్షతీర్థం''.కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు. విశ్వనాధుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు.

కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని 'భైరవ యాతన' అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను 'అమర్దకుడు' అని పిలుస్తారు.

ఇక నుండి నీవు నా దేవాలయలలో క్షేత్ర పాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు 'పాప భక్షకుడు' అనే పేరును ఇస్తున్నాను.నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు.

మనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా' అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు . భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.

ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. 'మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపు, కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.

ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.

ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం పూజించడం వలన సకల పుణ్య ఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి

English summary
This Article deals with Kala Bhairava Ashtami? Why Margashira Shudda Ashtami called as Kala Bhairava Ashtami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X