ఉచిత బస్సుకు సర్కార్ భారీ ఊరట...! ఆ రెండింటిపై ఉద్యోగుల పట్టు..!
ఏపీలో ఈ ఏడాది ఆగస్టు 15 కానుకగా కూటమి సర్కార్ ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో మహిళలు ఇందులో భాగంగా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ పథకానికి గానూ ఆర్టీసీ చెల్లించాల్సిన రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని మాత్రం చెల్లించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ రూ.400 కోట్ల నిధుల్ని విడుదల చేసింది.
ఉచిత బస్సు పథకం కోసం ఆర్టీసీ తమ సొంత నిధుల్ని వాడుతోంది. ఆ నిధుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే ఆగస్టు 15న పథకం ప్రారంభమైనా ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ నిధుల బకాయి రూ.400 కోట్లు చెల్లించలేదు. దీంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు, అదనపు ఉద్యోగుల నియామకాల హామీలు కూడా నెరవేరడం లేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని గమనించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ బకాయిలు తీర్చేందుకు నిధులు విడుదల చేసింది.

స్త్రీశక్తి పథకం కింద చెల్లించాల్సిన నిధులు రూ.400 కోట్లు విడుదలపై ఆర్టీసి ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. స్త్రీ శక్తి పధకం డబ్బులు విడుదలపై సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు తెలిపింది. ఆగస్టు 15 నుండి అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించింది. భవిష్యత్తులో ప్రతి నెల స్త్రీశక్తి పథకం రాయితీ మొత్తాన్ని సమయానికి చెల్లించాలని కూడా కోరింది.

మరోవైపు స్త్రీశక్తి పథకం విజయవంతం కావాలంటే కనీసం 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. అలాగే ఆర్టీసీలో ఉన్న ఖాళీలలో 10,000 మంది సిబ్బందిని నియమిస్తే సర్వీసులు సాఫీగా నడుస్తాయని, సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని ఆయన తెలిపారు. బస్సులు చాలక జరుగుతున్న ప్రమాదాలు కూడా తగ్గుతాయని దామోదర్ ప్రభుత్వానికి తెలిపారు. మరి ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications