బహిరంగ చర్చకు బాబు సవాల్
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో, రాష్ట్రానికి ఎవరు న్యాయం చేశారో, ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చ ద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. తెలంగాణాతో పాటు రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎవరేం చేశారో ఈ చర్చలో బయటకువస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసిన అనంతరం విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత విద్యుత్ చార్జీలను పెంచే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం వున్నదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యు, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల తదితర రంగాల్లో ఎవరు ఎంతచేశారో బహిరంగంగా చర్చకు రావాలని కాంగ్రెస్‌కు ఆయన సవాలు విసిరారు. కొంతమంది నేతలు చేస్తున్న అనుచితమైన హామీలను, ఇతర విమర్శలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని తగిన సమయంలో అలాంటి నాయకులకు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం తథ్యమని చంద్రబాబు ధీమాగా చెప్పారు.












Click it and Unblock the Notifications