రాజధాని శివార్లలో బాంబుపేలుడు
హైదరాబాద్‌ః హైదరాబాద్ శివార్లలో ఓ జీపులోపెట్టిన బాంబు పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొల్లారం సర్పంచ్ వి. ప్రతాప్ రెడ్డికి చెందిన జీపులో వుంచిన బాంబు నడిరోడ్డులో పేలడంతో ఒక టెలిఫోన్ బూత్ ధ్వంసమైంది. ఓ ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. వ్యాన్ డ్రైవర్, ప్రతాప రెడ్డి అనుచరులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బొల్లారం సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మెదక్ జిల్లా కౌజిపల్లి ఎం.పి.టి.సి.స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన వ్యాన్లో ఎవరో బాంబు అమర్చారు. వ్యాన్ ను డ్రైవర్ మరమ్మతు కోసం తరలిస్తుండగా నడిరోడ్డులో బాంబుపేలింది. దీనితో పరిసరాల ప్రజలు తీవ్రభయాందోళనలకు గురయ్యారు.
తనను హతమార్చేందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రత్యర్థులు ఈ బాంబు అమర్చారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాయలసీమ, పలనాడుకు పరిమితమైన బాంబుల సంస్కృతి హైదరాబాద్ కు వ్యాపించడం ఈ సందర్భంగా గమనార్హం.












Click it and Unblock the Notifications