కరుణానిధి హత్యకు కుట్ర
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకె అధినేత కరుణానిధి హత్యకు జయలలిత ప్రభుత్వం కుట్రపన్నిందని కేంద్ర మంత్రి, డిఎంకె సీనియర్ నేత మురసోలి మారన్ ఆరోపించారు. కరుణానిధి అరెస్టు సమయంలోనే ఈ హత్యకు విఫలప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.
మురసోలి మారన్‌పై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఏకపక్షంగా ఆయన్ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మారన్ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఉపసంహరించారు. కాగా ఆరోగ్య పరిస్థితి మెరుగుకావడంతో బుధవారం నాడు మారన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
కరుణానిధిని హత్య చేయడంతో పాటు ఆయన అరెస్టు సమయంలో పక్కనే వున్న తనను కూడా అంతమొందించి సాక్ష్యాలు లేకుండా చేయాలని కుట్రపన్నినట్టుగా ఆయన ఆరోపించారు. జయలలిత ప్రభుత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నదని గత ప్రభుత్వాల మాదిరిగా విచక్షణరహితంగా ఆర్టికల్ 356ను ప్రయోగించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 105 సార్లు ఈ ఆర్టికల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలపైకి ప్రయోగించి ఇప్పుడు నీతులు చెబుతున్నదని ఆయన విమర్శించారు.
తాము పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య విధానాల ప్రకారం ముందుకు సాగాలని కోరుకుంటున్నామని అయితే సాడిస్టూ, మూర్ఖురాలైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కేంద్రం ఆలోచనా ధోరణి, ఔదార్యం అర్ధమవుతాయని తాను భావించడం లేదని మారన్ అన్నారు. ముందుగా బెయిల్‌కు దరఖాస్తు చేయరాదని భావించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కరుణానిధి బెయిల్‌కోసం దరఖాస్తు చేసే అవకాశం వున్నదని మారన్ తెలిపారు. జైల్లో వున్న కరుణానిధిని కలుసుకున్న తర్వాత గానీ తాము ఈ విషయంలో తదుపరి నిర్ణయాలను ప్రకటించడం సాధ్యం కాదని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications