బిజెపి-శివసేన భాయీ భాయీ
ముంబయ్‌ః భారతీయ జనతా పార్టీతో స్నేహాన్ని కొనసాగించాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏతో భాగస్వామ్యాన్ని కూడా కొనసాగించాలని ఆ పార్టీ అధినేత బాల్ థాకరే నివాసంలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. శివసేన పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎం.పి.లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొంత కాలంగా శివసేన-బిజెపి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బిజెపితో శివసేన తెగతెంపులు చేసుకుంటున్నదని కూడా ప్రచారం జరిగింది.
యు.టి.ఐ. కుంభకోణంపై శివసేనఎం.పి. నిరుపమ్ చేసిన వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్రరూపం ధరించాయి. యు.టి.ఐ కుంభకోణంతో ప్రధాని కార్యాలయానికి కూడా సంబంధాలున్నాయని శివసేనఎం.పి. నిరుపమ్ పార్లమెంటులో ప్రకటించి సంచలనం సృష్టించారు.
దీనితో మనస్తాపం చెందిన ప్రధాని రాజీనామాకు కూడా సిద్ధ పడినవిషయం విదితమే. ప్రధానికి నిరుపమ్ క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయడంతో పరిస్థితి కాస్త చక్కబడింది. ఈ పరిస్థితుల మధ్య శుక్రవారం థాకరే నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏకు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంవిశేషం. పార్లమెంటులో శివసేన సభ్యులు రాజకీయ అవగాహనతో, గౌరవప్రదమై ప్రకటనలు చేయాలని కూడా ధాకరే ఈ సందర్భంగా సూచించారు. అలా అని అన్యాయం జరుగుతుంటే మౌనం వహించరాదని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications