IPL 2026: దెబ్బతీసిన సిరాజ్.. ఘోర పరాజయంతో CSK ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) పోరాటం ముగిసింది. ఘోర పరాజయంతో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ తేడాతో సీఎస్‌కేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ తమ టాప్-2 ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు లీగ్ దశను విజయంతో ముగించింది.
230 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. మహమ్మద్ సిరాజ్(3/26), కగిసో రబాడ(3/32), రషీద్ ఖాన్(3/18) ధాటికి 140 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పూర్తి ఇన్నింగ్స్ కూడా ఆడలేక 13.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది. శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూ షార్ట్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) పర్వాలేదనిపించాడు.

అంతకుముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు సాయి సుదర్శన్(53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), శుభ్‌మన్ గిల్(37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64), జోస్ బట్లర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీసారు.
దెబ్బతీసిన సిరాజ్..
230 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను పవర్ ప్లేలోనే మహమ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బతీసాడు. తొలి బంతికే సంజూ శాంసన్(0)ను క్యాచ్ ఔట్ చేసిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(16)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే సిరాజ్ మూడు వికెట్లు తీయడంతో సీఎస్‌కే కోలుకోలేకపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై వికెట్లు పారేసుకున్నారు.












Click it and Unblock the Notifications