పోలీసుల లాఠీఛార్జిపైఅసెంబ్లీలో వివాదం
హైదరాబాద్:విజయవాడ, నల్లగొండ, మిర్యాలగుడాల్లో గోదాముల ముట్టడి సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీఛార్జి బుధవారం శాసనసభలోవివాదానికి దారితీసింది. నల్లగొండ, మిర్యాలగుడా,విజయవాడల్లోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) గోదాములనుసిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీలు చేశారు. పోలీసుల లాఠీఛార్జీపై చర్చకు కాంగ్రెస్, సిపిఎం సభ్యులు బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ కె. ప్రతిభాభారతి త్రోసి పుచ్చారు.
ఈ విషయమై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేస్తుందని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. ఎఫ్‌సిఐ గోదాముల ముట్టడిని ప్రతిపక్షాలు చేయిస్తున్న అరాచకంగా ఆయన అభివర్ణించడంతో సభలో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వ్యాఖ్యను కాంగ్రెస్, సిపిఎం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వాగ్వివాదం సందర్భంగా సభ్యుల మాటల్లో దొర్లిన అప్రజాస్వామిక పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
గోదాములల్లో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయని, బియ్యం పంచడమైనా చేయాలి లేదా పనైనా కల్పించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
పోలీసులు ఎందుకు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చిందో చెప్పమంటే తాను చెప్తానని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ అన్నారు. సిపిఎం, రైతు కార్మిక సంఘం ఆందోళకారులు ఎఫ్‌సిఐ గోదాముల్లోకి చొరబడడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఆయన చెప్పారు. కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి కలెక్టర్లకు సమస్యను విన్నవించడం కాకుండా గోదాములను ముట్టడించడమేమిటని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications