21మంది నక్సల్స్ లొంగుబాటు
హైదరాబాద్: రాష్ట్రంలోని 21 మంది నక్సలైట్లు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎదుట ప్రభుత్వానికి లొంగిపోయారు.వీరంతా పీపుల్స్‌వార్‌కు చెందినవారు. వీరు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందినవారు.
లొంగిపోయినవారిలో ఇద్దరు డిప్యూటీ కమాండర్లు కూడా వున్నారు. ఒకరు డిసిఎం గెరిల్లా దళం సభ్యుడు. ఇద్దరు డిప్యూటీ కమాండర్లు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇంతపెద్ద యెత్తున నక్సలైట్లు ఒక్కసారి లొంగిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. పీపుల్స్‌వార్ సిద్ధాంతాలు నచ్చకే తాము నక్సలైట్ ఉద్యమంలో చేరామని లొంగిపోయిన నక్సల్స్ చెప్పారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక తాము ఉద్యమంలో చేరామని వారన్నారు.పీపుల్స్‌వార్ సిద్ధాంతాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవనివారన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నక్సలైట్లు తుపాకిని వదిలి జనజీవన స్రవంతిలో చేరాలని మరో మారు విజ్ఞప్తి చేశారు. బేషరతుగా చర్చలకు రావలసిందిగా ఆయన కోరారు. లొంగిపోయిన నక్సలైట్లలో వరంగల్ జిల్లా కు చెందిన వారు 9 మంది, కరీంనగర్ కు చెందిన ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు వున్నారు. వీరిలో వరంగల్ జిల్లా వార్ ఇన్ ఛార్జి వెంకటేశ్వర రావు కూడా వుండడం విశేషం. పలు హత్యలతో సంబంధం వున్న ఇతనిపై ప్రభుత్వం మూడులక్షల రివార్డు ప్రకటించింది.
లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. గ్రామ సభల తరహాలో నక్సలైట్లను వారి అనుభవాలు చెప్పాల్సిందిగా చంద్రబాబు విలేకరుల సమావేశంలో కోరారు. టీచర్ ఎదుట విద్యార్థుల్లా చంద్రబాబు ఎదుట నక్సలైట్లు చేతులు కట్టుకొని పాఠాలు అప్పగించినట్లు తమ అనుభవాలను వివరించడం విశేషం.












Click it and Unblock the Notifications