వరద బాధితులను ఆదుకుంటాం: బాబు
హైదరాబాద్: వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆయన బుధవారంనాడు వరద తాకిడికిగురైన కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో హెలికాప్టర్‌లో పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
పర్యటనకు బయలు దేరే ముందు ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. బాధితులకు తక్షణమే సహాయంఅందించాలని ఆయన ఆదేశించారు. రోడ్ల, కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన సూచించారు. సహాయ చర్యలకు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. అధికారుల అలసత్వం వల్లనే కడపలో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయమై విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంచినీరు, ఆహారం పొట్లాలు బాధితులకు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బుగ్గవలస ఆనకట్టకు ప్రమాదం వుందనే హెచ్చరికలు రావడంతో నిపుణులను అక్కడికి పంపించారు. కడప గత 40 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో వరదల్లో చిక్కుకుంది. ప్రధాన రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. అనంతపురం, కడప జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నెల్లూరులో పలు చెరువుల కట్టలు తెగిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలే వరదల్లో చిక్కుకున్నాయి.హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జార విడుస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాల అంచనాకు అధికారులు పూనుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఒక చెరువు కట్ట తెగిపోవడంతో 20 మంది కొట్టుకుపోయారు. ఇందులో ఇద్దరు మరణించారు. ఐదుగురు చెట్లను పట్టుకుని బయట పడ్డారు. మరో 13 మంది గల్లంతయ్యారు.
ఇదిలా వుంటే, గూడూరు- తిరుపతిల మధ్య రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో కొన్ని రైళ్లు పూర్తిగానూ, కొన్ని పాక్షికంగానూ రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి, గూడూరుల మధ్య రద్దు చేశారు. రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లను గుంతకల్లు వరకే నడుపుతున్నారు. పలు ప్యాసెంజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.












Click it and Unblock the Notifications