హోమ్ పేజి
ఖాట్మాండుః నేపాల్‌లో అత్యవసర పరిస్థితి ధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం లభించింది. మరోవైపు పోలీసులు, భద్రతాసిబ్బంది ముమ్మరంగా సాగిస్తున్న గాలింపు చర్యల్లో 150 మంది మావోయిస్టు తీవ్రవాదులు మరణించారు. గత శుక్రవారం నుంచి మావోయిస్టు తీవ్రవాదులు చెలరేగి సాగిస్తున్న మారణకాండలో భద్రతాదళాల సిబ్బందితో సహా వందలాది మరణించడంతో ప్రభుత్వం ఎమర్జెన్సి ప్రకటించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
టిబెట్ సరిహద్దుల్లో వున్న సోలుఖుంబు జిల్లాను కూడా తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ జిల్లాలో తీవ్రవాదులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పాతికమంది పోలీసులు, మరో నలుగురు సైనికులు మరణించినట్టుగా తెలిసింది.
గత ఆరేళ్లుగా మావోయిస్టులు సాగిస్తున్న హింసాకాండలో ఇప్పటివరకు కనీసం రెండువేల మంది బలైనట్టుగా చెబుతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో పాటు మావోయిస్టులను టెర్రరిస్టులుగా ప్రకటిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. రాజు జ్ఞానేంద్ర ఆమోదం లభించిన వెంటనే ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం వుంది. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేబా ఆదివారం నాడు రాజు జ్ఞానేంద్రను కలసి పరిస్థితిని వరించారు.












Click it and Unblock the Notifications