మళ్ళీ దర్శనం ఇచ్చిన లాడెన్
ఇస్లామాబాద్‌ః అంతర్జాతీయ ఉగ్రవాది, అమెరికా వెయ్యి కళ్ళతో గాలిస్తున్న ఒసామాబిన్ లాడెన్ మరో సారి టెలివిజన్ పై దర్శనం ఇచ్చారు. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం లాడన్ టెలివిజన్ లో కనిపించడం ఇది మూడోసారి. పాకిస్తాన్ నుంచి తమకు లాడెన్ ప్రసంగంతో కూడిన టేప్ అందినట్లు ఖతర్ కు చెందిన అల్ జహీరా టెలివిజన్ తెలిపింది. ఈ నెల ద్వితీయార్థంలోనే లాడన్ ప్రసంగాన్ని రికార్డు చేయడం జరిగిందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
లాడెన్ తోరాబోరా గుహలపై జరిపిన దాడుల్లో మరణించాడని అమెరికా అనుమానిస్తున్న తరుణంలో ఆయన మళ్ళీ ధిలాసాగా టెలివిజన్ లో కనిపించి ఖంగుతినిపించారు. అమెరికా ముస్లింలపై విద్వేషంతో వ్యవహరిస్తున్నదని లాడెన్ నిప్పులు చెరిగారు. అమెరికా జరిపిన దాడుల వల్ల అమాయకులై ఆఫ్ఘన్ ప్రజలు పాకిస్తాన్ పారిపోయి దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలపై కత్తికట్టి వ్యవహరిస్తున్న అమెరికా అంతు చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
లాడెన్ 30 నిముషాల ప్రసంగంతో కూడిన ఈ టేప్ కేవలం ఉగ్రవాద ప్రచార గిమ్మిక్కు అని అమెరికా కొట్టిపారేసింది. అసలు ఆ టేప్ తాజాదేనా? లేక గతంలో తీసిందా అనే విషయం దిశగా దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఆ టేప్ నిజమైనదేనని, ఇటీవలే చిత్రీకరించిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రి, ప్రిన్స్ సుల్తాన్ అజీజ్ బిబిసికి చెప్పారు.












Click it and Unblock the Notifications