బాబు ప్రభుత్వానికి సిన్హా కితాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణ, రుణాల తీరు తెన్నులపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కితాబు ఇచ్చారు. ఈవిషయాలపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మంగళవారం రాజ్యసభలో వాగ్యుద్ధానికి దిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేస్తోందని యశ్వంత్ సిన్హా కూడాఅంగీకరించారని, అందుకు సంతోషించాలని తెలుగుదేశం సభ్యుడు అల్లాడి రాజ్‌కుమార్ అన్నారు.దాసరికి కాంగ్రెస్ సభ్యులు నంది ఎల్లయ్య, సుబ్బరామిరెడ్డి మద్దతు తెలియజేశారు. ప్రపంచ బ్యాంక్, డిఎఫ్‌ఐడిలతో ఆంధ్రప్రదేశ్ నేరుగా సంప్రదింపులు జరుపుతోందా, ఒక వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాలను తిరిగి చెల్లించకపోతే సంభవించే పరిణామాలేమిటి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధులవివరాలేమిటి అని వారు ప్రశ్నించారు.
ఈ సమయంలో యశ్వంత్ సిన్హా జోక్యం చేసుకుని- ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, పరిస్థితి ఒకసారి మెరుగు పడితే ఆర్థిక, సామాజికఅంశాలపై దృష్టి కేంద్రీకరించ గలుగుతుందని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ రుణం పొందడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులను, మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని,అందు వల్ల ఎలాంటి సమస్య లేదని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలకు నిధులు కోరిందని,అందుకే దానికి నిధుల లభ్యత పెరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
