టాటా సన్స్ కు ఆర్‌బీఐ అనూహ్య షాక్: ఐపీఓకు వెళ్లక తప్పదా? నెక్ట్స్ స్టెప్..!
దేశంలో అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కు ఇవాళ ఆర్బీఐ (RBI) గట్టి షాక్ ఇచ్చింది. నియంత్రణ పరిధి లేని అన్‌రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా కొనసాగేందుకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ (Tata Sons) చేసిన విజ్ఞప్తిని ఆర్బీఐ తిరస్కరించింది. ఈ కీలక నిర్ణయంతో టాటా సన్స్ తప్పనిసరిగా పబ్లిక్ ఇష్యూ (IPO)కు వెళ్లి, స్టాక్ మార్కెట్లలో కచ్చితంగా లిస్ట్ కావాల్సిన పరిస్దితులు ఏర్పడ్డాయి.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను ఎన్‌బీఎఫ్‌సీ-అప్పర్ లేయర్ కేటగిరీ కింద అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగంగా వర్గీకరించారు. ఈ హోదా నుంచి మినహాయింపు పొంది, తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడానికి టాటా సన్స్ అనుమతి కోరింది. అయితే ఈ ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరించింది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తించే నిబంధనలన్నింటినీ తక్షణం కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఆర్బీఐ కొత్త స్కేల్ ఆధారిత నిబంధనల ప్రకారం లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన ఆర్థిక సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీ-అప్పర్ లేయర్‌గా పరిగణిస్తారు. టాటా సన్స్ నేరుగా ప్రజల నుంచి నిధులు సేకరించనప్పటికీ, టాటా స్టీల్, టాటా పవర్, టాటా కెమికల్స్ వంటి గ్రూప్ లిస్టెడ్ కంపెనీల పెట్టుబడుల ద్వారా పరోక్షంగా ఇందులో ప్రజల నిధులు ఉన్నాయి. అందువల్ల నియంత్రణ పరిధిని పరిమితం చేసుకునేందుకు టాటా సన్స్ చేసిన ప్రయత్నాలకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.

టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియపై టాటా ట్రస్ట్ బోర్డు సభ్యులలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా సహా కొందరు మాజీ డైరెక్టర్లు సంస్థను క్లోజ్‌డ్ ప్రైవేట్ లిమిటెడ్‌గానే కొనసాగించాలని కోరుతున్నారు. మరోవైపు ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లతో పాటు 18.3 శాతం వాటా కలిగిన మైనారిటీ షేర్‌హోల్డర్ అయిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం సంస్థ ఐపీఓకి వెళ్లాలని పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ భాగస్వామ్య వాటాల విక్రయం ద్వారా భారీగా నిధులు సమీకరించుకునే వీలుంటుంది. అలాగే కఠిన నియంత్రణల అమలు వల్ల టాటా సన్స్‌లో పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్‌బీఐ ఆదేశాల గడువు నేపథ్యంలో టాటా గ్రూప్ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
