పైచేయి కోసం పోలీసులు, నక్సల్స్ పోటీ
హైదరాబాద్‌ః రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పీపుల్స్ వార్ ప్రతినిధులకు, ప్రభుత్వ ప్రతినిధులకు జరిగిన చర్చలు వ్యూహత్మకంగా సాగాయి. చర్చలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముంది కరీంనగర్ జిల్లా జనశక్తి ఆర్గనైజర్ బాలయ్యను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ అంశాన్ని గద్దర్, వరవరరావు ప్రభుత్వ ప్రతినిధులైన విజయరామారావు, తమ్మినేని సీతారాంకు చర్చల మొదలు పెట్టగానే చెప్పారు. చర్చలకు విఘాతం కలిగించాలనేకరీంనగర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఈ పని చేశారని వారు నిరసన వ్యక్తం చేశారు.
ఒక వైపు చర్చలు జరుగుతుండగా కరీంనగర్ జిల్లాలో హై డ్రామా నడిచింది. బుధవారం ఉదయం బాలయ్యను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఆ తరువాత 26 మంది నక్సలైట్లు ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు. నక్సలైట్లపై పై చేయి సాధించడంలో పోలీసులు ఈ విధంగా కృతకృత్యులయ్యారు. నక్సలైట్లు కాల్పులవిరమణ ప్రకటించినప్పటికీ బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవుల్లో పోలీసులు - నక్సలైట్లు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అచ్చంపేట నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరిన బస్సులో అచ్చంపేట ఎస్.ఐ. నర్సింహులు, బల్మూరు ఎస్.ఐ. శంకర్ తో పాటు 15 మంది పోలీసులు వున్నారు.
ఇదే జిల్లా అయినోలులో గ్రామసభ నిర్వహించేందుకు 40 మంది నక్సలైట్లు సిద్ధం అవుతున్నారు. 30 మంది గ్రామంలో వుండగామిగిలిన 10 మంది ఊరిబయట కాపలాగా వున్నారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుఅయినోలుకు చేరుకోగానే ఎస్‌ఐ లను నక్సలైట్లు గుర్తుపట్టారు. కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. బస్సులో వున్న 70 మంది భయబడిపోయారు. బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నించిన ముగ్గురికి తూటాలు తగిలాయి. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఈ సంఘటన గురించి తెలియడంతో పోలీసు బలగాలు నల్లమల అడవులకు తరలివెళ్ళాయి.












Click it and Unblock the Notifications
