హైదరాబాద్‌ః పీపుల్స్ వార్‌తో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన చర్చలు గురువారం నాడు మూడోవిడత జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు విడతల చర్చలు జరిగినా అసలు విషయం మాత్రం ఇంకా ప్రస్తావనకే రాలేదు.
పీపుల్స్ వార్ అగ్రనేతలతో ప్రభుత్వం జరిపే చర్చలకు విధివిధానాలను నిర్ణయించడానికి ఎజెండా ఖరారు చేయడానికి ప్రముఖవిప్లవ గాయకుడు గద్దర్, విప్లవ రచయిత వరవరరావులు వార్ ప్రతినిధులుగా ప్రభుత్వంతో మంతనాలు ప్రారంభించినవిషయం విదితమే. రెండు దఫాల చర్చల్లో కూడా ఎన్‌కౌంటర్లు ఆపడం గురించి, నిషేధం ఎత్తివేత గురించే మాట్లాడారు. పోలీసులు చర్చలకు ఆటంకం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్ ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది వున్నట్టుగా కనిపించడం లేదని చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆరోపిస్తూ వార్ ప్రతినిధులు బుధవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరుతున్నామని ప్రభుత్వం ఆరోపించడాన్ని ఖండిస్తూ ఎవరివి గొంతెమ్మ కోరికలో గమనించాలని వారుకోరారు. ప్రభుత్వం చర్చల విషయంలో పూర్తి సముఖంగా లేనప్పటికీ తాము చర్చలకు వెళ్లుతామని వారు చెప్పారు.